ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరులో చికెన్ షాపుల నుంచి వెలువడే వ్యర్థాల వ్యాపారానికి డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా కాంట్రాక్టర్లు మారుతున్నారు. ఆదాయం కోసం పోటీపడుతున్నారు. ఇందులో భాగంగానే ఈ వ్యర్థాలను తమ పార్టీ నాయకుడికి ఇవ్వాలని స్థానిక అధికార పార్టీ నేతలు సిఫారసు చేశారు. ఆ మేరకు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి ఏకంగా చికెన్ సెంటర్ల యజమానులకు సర్క్యులర్ జారీ చేశారు. ప్రొద్దుటూరులో సుమారు వందకుపైగా చికెన్ షాపులు ఉన్నాయి. చికెన్ తయారు చేసేటప్పుడు వెలువడే వ్యర్థాలను షాపుల యజమానులు భద్రపరచడం, కాంట్రాక్టర్లు వీటిని వ్యాన్ల ద్వారా తరలించడం జరుగుతోంది. ఈ వ్యర్థాలను గతంలో మైలవరానికి చెందిన కాంట్రాక్టర్ తీసుకెళ్లేవారు. ఏడాది కిందట నంద్యాలకు చెందిన కాంట్రాక్టర్ అనధికారికంగా పోటీపడి వ్యాపారం దక్కించుకున్నారు. చికెన్ వ్యర్థాలతో రూ.లక్షలు సంపాదిస్తున్నారు.
ఏడాది పాటు అనుమతి
పట్టణంలో చికెన్ షాపుల నుంచి వెలువడే వ్యర్థాలను మంగదొడ్డి ఓబులేసుకు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి గత నెల 29న చికెన్ షాపుల యజమానులకు సర్క్యులర్ జారీ చేశారు. ఈ నెల 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది మే 31 వరకు ఏడాది పాటు ఈ కాంట్రాక్టర్‌కు అనుమతి ఇచ్చినట్లు కమిషనర్ పేర్కొన్నారు. సాధారణంగా కాంట్రాక్టర్ వాహనం ఏర్పాటు చేసుకుని వ్యర్థాలను తరలించాల్సి ఉంది. అయితే ప్రస్తుత కాంట్రాక్టర్ అధికార పార్టీ నేత కావడంతో.. ఆ వాహనానికి ఏకంగా మున్సిపాలిటీ స్టిక్కర్ అతికించుకుని వ్యర్థాలను తరలిస్తున్నారు. వాహనం చూసిన వారంతా మున్సిపల్ సిబ్బంది వీటిని తరలిస్తున్నారేమోనని చర్చించుకుంటున్నారు. ఎందుకు ఈ స్టిక్కర్ అతికించారని మున్సిపాలిటీ సిబ్బందిని ప్రజలు ప్రశ్నిస్తుండగా.. కమిషనర్ అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చారని చెబుతున్నారు. పట్టణంలోని చికెన్ షాపుల వారు పురపాలక సంఘం వారికి సహకరించి ప్రజల ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అంటువ్యాధులు వ్యాపించకుండా సహకరించాలని కోరారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణంలోని సుమారుకు వందకుపైగా చికెన్ షాపుల నుంచి టన్నుల కొద్ది ఉత్పత్తి అయ్యే చికెన్ వ్యర్థాలను కాంట్రాక్టర్ సేకరిస్తున్నారు. వీటిని చేపలకు ఆహారంగా వినియోగించేందుకు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది.
మా వారికే ఇవ్వండి
అధికార పార్టీ నాయకుడి ఆదేశాలు
సర్క్యులర్ జారీ చేసిన కమిషనర్
మున్సిపాలిటీ స్టిక్కర్‌తో రవాణా
కాలుష్యాన్ని తగ్గించేందుకే..
పట్టణంలోని చాలా మంది చికెన్ సెంటర్ యజమానులు చికెన్ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ కాలువల్లో, రోడ్లపై వేస్తున్నారు. ఈ కారణంగా కాలుష్యాన్ని తగ్గించేందుకు చికెన్ వ్యర్థాలను తరలించేందుకు ఆయనకు అప్పగించాం. ఇందుకు ఎలాంటి టెండర్లు పిలువలేదు. పలు మున్సిపాలిటీల్లో ఇదే విధానాన్ని అమలు చేశారు. వ్యాన్‌కు ఉన్న మున్సిపాలిటీ స్టిక్కర్‌ను తొలగిస్తాం.
– రవిచంద్రారెడ్డి, మున్సిపల్ కమిషనర్, ప్రొద్దుటూరు.


