● అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలింపు
● కూటమి నాయకుల దందా
● పట్టించుకోని అధికారులు
లింగాల : లింగాల మండలం పార్నపల్లె సమీపంలోని చిత్రావతి నది ఛిద్రమవుతోంది. కూటమి నాయకులు యథేచ్ఛగా ఇసుకను భారీ యంత్రాలు, టిప్పర్లతో తరలిస్తున్నారు. అర్ధరాత్రి వేళ కూటమి నాయకుల దందా కొనసాగుతోంది. పోలీసుల పర్యవేక్షణ లోపం, అధికారుల నిఘా కొరవడింది. దీంతో పార్నపల్లె చిత్రావతి నదిలో ఇసుక రీచ్ లేకపోయినా అక్రమంగా రాత్రి సమయంలో ఇసుకను భారీగా తరలిస్తున్నారు. చిత్రావతి నది బ్రిడ్జి సమీపంలో టన్నుల కొద్ది ఇసుకను తవ్వి అక్రమంగా తరలిస్తుండటంతో బ్రిడ్జికి ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని పార్నపల్లె గ్రామ ప్రజలతోపాటు పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సీబీఆర్ బ్రిడ్జి వద్ద పోలీసు చెక్‌పోస్టు, సీసీ కెమెరాల నిఘా ఉండేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలీసు చెక్‌పోస్ట్ ఎత్తేసి సీసీ కెమెరాలు తొలగించారు. దీంతో నిఘా కొరవడింది. అటు భూగర్భగనుల శాఖ అధికారుల పర్యవేక్షణ శూన్యంగా మారింది. ప్రతి రోజు రాత్రి 10 గంటల తర్వాత భారీ పొక్లెయిన్లు చిత్రావతి నదిలోకి తీసుకెళ్లి భారీ టిప్పర్లతో టన్నులకొద్ది ఇసుకను తవ్వుతున్నారు. టిప్పర్ల ద్వారా సమీపంలో ఓ కంపెనీ వారు నిర్మిస్తున్న జల విద్యుత్ కేంద్రానికి, రాష్ట్ర సరిహద్దులు దాటి కర్ణాటక రాష్ట్రానికి కూడా ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అక్రమ ఇసుకను అరికడతామని, వినియోగదారులకు ఉచితంగా అందిస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం తప్ప.. చేసిందేమీ లేదన్నారు. భారీ ఎత్తున ఇసుక తరలుతున్నా భూగర్భ గనుల శాఖ అధికారులు చోద్యం చూస్తుండటంతో ప్రజలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. చిత్రావతి బ్రిడ్జికే కాక, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు కూడా ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని, ఇలాంటి అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. కూటమి నాయకులు ఇసుకను భారీ తరలించి జేబులు నింపుకొంటున్నారు. పరిసర గ్రామాల రైతులు తట్టెడు ఇసుకను గృహ అవసరాలకు తీసుకెళ్లాలన్నా భయాందోళనకు గురవుతున్నారు. అయితే కూటమి నాయకులు యథేచ్ఛగా టన్నులకొద్ది ఇసుకను తరలించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా అక్రమ ఇసుక తవ్వకాలను అధికారులు ఆపివేయకపోతే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


