మాకు న్యాయం చేయాలి | - | Sakshi
Sakshi News home page

మాకు న్యాయం చేయాలి

Jun 17 2026 4:57 AM | Updated on Jun 17 2026 4:57 AM

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : తమ ఇంటిని తెలియకుండా ఇతరులకు అమ్మడమే కాకుండా తమను భయభ్రాంతులకు గురి చేస్తున్న వారి బారి నుంచి కాపాడి తమ కుటుంబానికి న్యాయం చేయాలని మస్తాన్‌, ఆయన కుటుంబ సభ్యులు కోరారు. మంగళవారం వారు మీడియాతో తమ ఆవేదన వ్యక్తం చేశారు. కడప నగరం భవానినగర్‌ అక్కాయపల్లె ప్రాంతంలో తాము 40 ఏళ్లుగా నివాసముంటున్నామన్నారు. అయితే వైద్య శాఖలో పని చేస్తున్న శ్రీదేవి అనే మహిళ ఇంటికి లోను ఇప్పించగా, 2017 నుంచి 2020 వరకు తాను లోను కట్టానని తెలిపారు. ఆ తర్వాత శ్రీదేవి మిగిలిన రుణాన్ని చెల్లించి ఇంటిని ఇతరులకు విక్రయించడం జరిగిందన్నారు. రుణం మంజూరు సందర్భంగా తాను ఐదు లక్షల వరకు కమీషన్‌ సైతం ఇవ్వడమే కాకుండా క్రమం తప్పక ఇంటి పన్ను, కరెంటు బిల్లు చెల్లిస్తూ వస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా శివ అనే యువకుడితోపాటు కొంత మంది అల్లరి మూకల కారణంగా తాము తీవ్ర భయాందోళనకు గురవుతున్నామన్నారు. తమ ఇంటికి సంబంధించి అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వారు వివరించారు. జిల్లా కలెక్టర్‌, ఎస్పీలు తమ విషయంపై విచారణ చేసి, అల్లరి మూకల నుంచి తమను కాపాడాలని, తమ ఇంటిని తిరిగి తమకు దక్కేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బాధితుడు మస్తాన్‌ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

పోలీస్‌ కళా జాగృతి బృందం నాటక ప్రదర్శన

చింతకొమ్మదిన్నె : జిల్లా ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్‌ ఆదేశాల మేరకు మంగళవారం సీఎంఆర్‌ పల్లె సమీపంలోని అంగడివీధిలో పోలీస్‌ కళా–జాగృతి బృందం ఇన్‌చార్జ్‌ నరసరామ్‌ బృందంచే ‘ఓ యువతా... మేలుకో’ నాటక, పాటల ప్రదర్శన ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చింతకొమ్మదిన్నె సీఐ బాలమద్దిలేటి మాట్లాడుతూ మత్తుపదార్థాల వాడకం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు, సమాజంలోని రుగ్మతలు వాటి వల్ల కలిగే అనర్థాల గురించి వివరించారు. మత్తు పదార్థాల ఆచూకీ తెలిసిన వెంటనే టోల్‌ ఫ్రీ నంబర్‌ 1972కు కాల్‌ చేసి తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్షన్‌ జోన్‌ ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం, ఈగల్‌ టీం అధికారులు ఆయూబ్‌ ఖాన్‌, గురుశేఖర్‌, చింతకొమ్మదిన్నె పోలీసుస్టేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఆగని మోటారు వైర్ల చోరీలు

బి.కోడూరు : మండలంలో కొంత కాలంగా వ్యవసాయ మోటార్లకు సంబంధించిన కేబుల్‌ వైర్లు చోరీకి గురవుతుండటంతో రైతులు బెంబేలెత్తుతున్నారు. ప్రభలవీడు, నర్సయ్యకొట్టాలు, పెద్దుళ్లపల్లె గ్రామాల్లో గతంలో కేబుల్‌ వైర్లు దొంగలిస్తున్న దొంగలను పట్టుకుని పోలీసులకు అప్పగించినా చోరీలు మాత్రం ఆగడం లేదు. తాజాగా సోమవారం రాత్రి ఐత్రంపేట గ్రామంలో కూడా ఎనిమిది మోటార్లకు సంబంధించిన కేబుల్‌ వైర్లు చోరీకి గురయ్యాయి. దీంతో మండలంలోని రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ చూపి కేబుల్‌ వైర్లను చోరీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల రైతులు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement