పాత పింఛన్లే దిక్కు.. ఎన్నికల హామీలపై మౌనం !
● ప్రభుత్వ పింఛన్ల వెబ్‌సైట్ మూసివేత
● ‘రీ వెరిఫికేషన్’ పేరిట
4 వేల దివ్యాంగుల పింఛన్లకు కోత
కాశినాయన: కూటమి సర్కార్‌లో కొత్త పింఛన్ల మంజూరు దేవుడెరుగు కానీ, ప్రస్తుతం వస్తున్న పాత పింఛన్లను కూడా ‘రీ వెరిఫికేషన్’ పేరుతో ప్రభుత్వం ఊడబీకుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అర్హులైన పేదలు, ముఖ్యంగా నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగుల పింఛన్లను సైతం వెరిఫికేషన్ సాకుతో తీసేస్తుండటంతో సామాజిక పింఛన్‌దారులలో తీవ్ర భయాందోళనలు, అసహనం వ్యక్తమవుతున్నాయి.
4 వేల దివ్యాంగ పింఛన్ల కట్..
కడప, ప్రొద్దుటూరుకు తిప్పలు!
సామాజిక పింఛన్ల ఏరివేతలో భాగంగా ప్రభుత్వం మొదట దివ్యాంగులను లక్ష్యంగా చేసుకుంది. వైఎస్సార్ కడప జిల్లావ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 4,000 మంది దివ్యాంగుల పింఛన్లను రీ వెరిఫికేషన్ పేరిట నిలిపివేసి ఘోర అన్యాయం చేశారు. అర్హులైన దివ్యాంగ పింఛన్‌దారులకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు నోటీసులు ఇస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఆ నోటీసుల ప్రకారం రీ వెరిఫికేషన్ కోసం కడప రిమ్స్ లేదా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రులలోని మెడికల్ బోర్డుల (సదరం క్యాంపుల) చుట్టూ తిరగాలని అధికారులు నిబంధనలు పెడుతున్నారు. తీవ్రమైన శారీరక వైకల్యంతో, కనీసం నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు, వృద్ధులు అంతదూరం ప్రయాణాలు చేయలేక నరకయాతన అనుభవిస్తున్నారు.
రెండేళ్లయినా తెరచుకోని వెబ్‌సైట్..
సిబ్బంది అవస్థలు!
ఎన్నికల నోటిఫికేషన్ సమయంలో నిలిపివేసిన పింఛన్ల వెబ్‌సైట్‌ను, కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లయినా ఇప్పటికీ తెరవకపోవడంతో ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తిగా స్తంభించింది. ప్రతిరోజూ వందలాది మంది వృద్ధులు, వికలాంగులు ఆశతో గ్రామ, వార్డు సచివాలయాలకు వస్తున్నారు. అయితే సైట్ ఓపెన్ కాలేదని చెప్పడానికి సచివాలయ సిబ్బంది సైతం చెప్పుకోలేక తలలు పట్టుకుంటున్నారు. ఎవరైనా వృద్ధులు కార్యాలయం బయట కనిపిస్తే ఏం సమాధానం చెప్పాలా అని సిబ్బంది మదనపడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో ఒక సర్దిచెప్పే సమాధానం ఇచ్చి పంపిస్తుండటంతో, లబ్ధిదారులు నిరాశతో వెనుతిరుగుతున్నారు.
గతంలో నిరంతర ప్రక్రియ.. నేడు గగనం!
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పింఛన్ల మంజూరు అనేది ఒక నిరంతర ప్రక్రియలా సాగేది. అప్పట్లో పింఛన్ల కోసం అర్హులైన వారి నుంచి గ్రామ వలంటీర్లే నేరుగా దరఖాస్తులు స్వీకరించి, గ్రామ సచివాలయాల్లో ఆన్‌లైన్ చేసేవారు. అలా దరఖాస్తు చేసుకున్న వారికి ప్రతి ఆరు నెలలకోసారి (జూన్, డిసెంబర్లలో) క్రమం తప్పకుండా కొత్త పింఛన్లను మంజూరు చేసేవారు. కానీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం వెబ్‌సైట్‌ను పూర్తిగా నిలిపివేయడంతో అర్హులైన వారు నిత్యం సచివాలయాల చుట్టూ తిరగలేక ఇబ్బందులు పడుతున్నారు. సచివాలయాల్లో పనికాకపోవడంతో, ప్రతి సోమవారం కలెక్టరేట్లలో నిర్వహించే ’ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో సైతం పింఛన్లు మంజూరు చేయాలంటూ వేలాదిగా అర్జీలు సమర్పిస్తున్నారు.
వైఎస్సార్ కడప జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 2,55,719 పింఛన్లు లబ్ధిదారులకు అందుతున్నాయి. అయితే, ఈ పింఛన్లన్నీ గత ప్రభుత్వ హయాంలో మంజూరైనవే కావడం గమనార్హం. ప్రస్తుతం సచివాలయాల్లో కేవలం ఒకే ఒక రకమైన పింఛన్ ప్రక్రియ మాత్రమే సాగుతోంది. అదేమిటంటే.. ఇప్పటికే పింఛన్ పొందుతున్న భర్త మరణిస్తే, అతడి వారసత్వంగా ఆ పింఛన్‌ను భార్యకు బదిలీ చేసి ఇస్తున్నారు తప్ప కొత్తగా అర్హత సాధించిన ఎవ్వరికీ నూతన పింఛన్ల ఊసే ఎత్తడం లేదు. దీనికి తోడు, తాము అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మరియు మైనారిటీ వర్గాల వారికి 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామని ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన కీలక హామీపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కొత్త పింఛన్ల కోసం ప్రజలు ఎదురు చూస్తుంటే ఉన్న పింఛన్లను తొలగించడాన్ని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం అర్హులైన దివ్యాంగులకు, వృద్ధులకు న్యాయం చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.


