ఎవరెవరికి అవకాశాలు? | - | Sakshi
Sakshi News home page

ఎవరెవరికి అవకాశాలు?

Jun 16 2026 1:28 AM | Updated on Jun 16 2026 1:28 AM

రాయల్స్‌ ఆఫ్‌ రాయలసీమ

● వైఎస్‌ రాజారెడ్డి స్టేడియంలో క్రికెట్‌ ధమాకా ● తొలిసారి ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో మ్యాచ్‌లు ● బుధవారం నుంచి సమరం ● అభిమానులకు ఉచిత ప్రవేశం ● సందడి చేయనున్న సింగర్స్‌

సాక్షి ప్రతినిధి, కడప: కడప గడపలో క్రికెట్‌ క్రీడాభిమానులకు కన్నుల పండుగ కానుంది. ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ప్రతిష్టాత్మక ‘ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) 2026’ రెండో దశ మ్యాచ్‌లు బుధవారం (జూన్‌ 17) నుంచి తొలిసారిగా జిల్లా కేంద్రంలో ప్రారంభం కానున్నాయి. స్థానిక వైఎస్‌ రాజారెడ్డి క్రికెట్‌ స్టేడియంలో ఐదు రోజుల పాటు మొత్తం 9 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్లడ్‌లైట్స్‌ వెలుగుల్లో ఈ టీ–20 పోరు సాగనుండటంతో జిల్లా వ్యాప్తంగా క్రీడాభిమానులల్లో పండుగ వాతావరణం ఏర్పడింది. రూ.7 కోట్లతో ఆధునిక వసతులు ఏపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణ కోసం ఏసీఏ ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. హనుమ విహారి, నితీష్‌ కుమార్‌ రెడ్డి, కేఎస్‌ భరత్‌, రికీ భుయ్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు తమ ప్రతిభను చాటడానికి ఇప్పటికే కడపలో అడుగుపెట్టారు.

ఏడు జట్ల హోరాహోరీ.. రోజుకు రెండు మ్యాచ్‌లు

ఈ టోర్నమెంట్‌లో 7 జట్లు తలపడనున్నాయి. ప్రతి రోజూ రెండు మ్యాచ్‌లు జరగనుండగా, మొదటి మ్యాచ్‌ మధ్యాహ్నం 2:00 గంటలకు, రెండో మ్యాచ్‌ సాయంత్రం 6:00 గంటలకు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం మ్యాచ్‌లు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో హై–వోల్టేజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను పంచనున్నాయి.

ఊరూరా విస్తృత ప్రచారం.. పాఠశాలల ప్లాన్‌!

కడపలో ఏపీఎల్‌ నిర్వహణపై ఏసీఏ సోషల్‌ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేపట్టింది. ఈ టోర్నీ కోసం విడుదల చేసిన ప్రత్యేక సాంగ్స్‌ సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయ్యాయి. మరోవైపు జిల్లా వ్యాప్తంగా భారీ హోర్డింగ్స్‌, బెలూన్స్‌ ద్వారా ఏపీఎల్‌పై పెద్ద ఎత్తున ప్రచారం కల్పించారు. ప్రైవేటు, రెసిడెన్షియల్‌ పాఠశాలల విద్యార్థులకు ఈ క్రికెట్‌ మ్యాచ్‌లు చూపించాలనుకుంటుండటంతో ఏపీఎల్‌ పండగలా మారింది.

చక్కటి వసతులు.. ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం!

కడపలో మ్యాచ్‌లు వీక్షించేందుకు వచ్చే క్రీడాభిమానులకు స్టేడియంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చక్కటి వసతులు సమకూర్చినట్లు ఏసీఏ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ డెవెలప్‌మెంట్‌ కమిటీ సభ్యుడు భరత్‌రెడ్డి, జిల్లా క్రికెట్‌ అసోషియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు మునికుమార్‌రెడ్డి, రెడ్డిప్రసాద్‌లు తెలిపారు.

ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ 2026 ప్లేఆఫ్స్‌ (టాప్‌–4 స్థానాల) రేసు ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా మారింది. లీగ్‌ దశలో ప్రతి జట్టు మొత్తం 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల ఆధారంగా ఏడు జట్ల ప్లేఆఫ్స్‌ అర్హత అవకాశాలు క్రింది విధంగా ఉన్నాయి.

క్యాపిటల్‌ అమరావతి రాయల్స్‌/భీమవరం బుల్స్‌

ఈ రెండు జట్లు తలా 6 పాయింట్లతో టేబుల్‌లో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.

అర్హత సమీకరణం: అమరావతి రాయల్స్‌ ఆడిన 3 మ్యాచ్‌లూ గెలిచి అజేయంగా ఉంది. వీరు కడప లెగ్‌లో ఆడబోయే 3 మ్యాచ్‌లలో కేవలం ఒక్క మ్యాచ్‌ గెలిచినా ప్లేఆఫ్స్‌ సీటు ఖరారవుతుంది. భీమవరం బు ల్స్‌ ఒక్క విజయం సాధిస్తే సేఫ్‌ జోన్‌లో ఉంటుంది.

కాకినాడ కింగ్స్‌/విజయవాడ సన్‌షైనర్స్‌

ఈ రెండు జట్లు తలా 4 మ్యాచ్‌లు ఆడి, 2 విజయాలతో 4 పాయింట్లు సాధించాయి.

అర్హత సమీకరణం: ఈ జట్లకు ఇంకా రెండేసి మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ప్లేఆఫ్స్‌ చేరాలంటే కడప దశలో వీరు ఆడబోయే రెండు మ్యాచ్‌లలో కనీసం ఒకటైనా భారీ రన్‌ రేట్‌తో గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ రెండూ గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా నేరుగా క్వాలిఫై అవుతారు.

సింహాద్రి వైజాగ్‌ లయన్స్‌/తుంగభద్ర వారియర్స్‌

ఈ రెండు జట్లు కేవలం ఒక్కో విజయం (2 పాయింట్లు)తో ఐదు, ఆరో స్థానాల్లో ఉన్నాయి.

అర్హత సమీకరణం: వీరికింకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. రేసులో నిలవాలంటే కడప గడ్డపై ఆడబోయే 3 మ్యాచ్‌లలో కనీసం 2 మ్యాచ్‌లు కచ్చితంగా గెలవాలి. నెట్‌ రన్‌ రేట్‌ చాలా మైనస్‌లో ఉన్నందున భారీ విజయాలు అవసరం.

రాయల్స్‌ ఆఫ్‌ రాయలసీమ

ఆడిన 3 మ్యాచ్‌లలోనూ ఓడిపోయి సున్నా పాయింట్లతో పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది.

అర్హత సమీకరణం: రాయలసీమ జట్టు ప్లేఆఫ్స్‌ చేరాలంటే ఇకపై అద్భుతం జరగాలి. కడపలో వారు ఆడబోయే మిగిలిన 3 మ్యాచ్‌లలోనూ భారీ తేడాతో విజయం సాధించడంతో పాటు, విజయవాడ, కాకినాడ జట్లు తమ మిగిలిన మ్యాచ్‌లలో ఓడిపోవాలని ప్రార్థించాలి.

కెప్టెన్‌: షేక్‌ రషీద్‌

ప్రధాన ఆటగాళ్లు: జె. సాకేత్‌ రామ్‌, ఎస్‌.ధ్రువ కుమార్‌ రెడ్డి, తేజ రెడ్డి ఎర్రగుడి, సాయి పూర్ణ తేజ గరిమెళ్ల, వంశీ కృష్ణ మామిడి, వాసు యెడ్ల, ఎన్‌. మాధవ్‌.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement