● ప్రొద్దుటూరు శివాలయంలో
సమాంతర సొసైటీ కలకలం
● చైర్మన్, అర్చకులు అధ్యక్ష, కార్యదర్శులుగా సేవా సంఘం రిజిస్ట్రేషన్
● ఈఓ, అధికారిక రశీదులను కాదని సొంత అకౌంట్లతో చందాల వసూళ్లకు స్కెచ్
● నేటి నుంచే మహా కుంభాభిషేకం
ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరులోని శ్రీ అగస్త్యేశ్వరస్వామి ఆలయం అత్యంత ప్రాచీనమైనది. ఇక్కడ కొంతకాలంగా తరచూ వివాదాలు నడుస్తున్నాయి. తాజా గా ‘శ్రీ అగస్త్యేశ్వర ప్రగతి సేవాసంఘం’ పేరుతో ఆల య కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న వంగల నారాయణరెడ్డి గౌరవాధ్యక్షుడిగా, అర్చకుడు సతీష్‌కుమార్ అధ్యక్షుడిగా, మరో అర్చకుడు మహేశ్వర శర్మ ఉపాధ్యక్షుడిగా, ఉదయ్‌భాస్కర్ ప్రధాన కార్యదర్శిగా సంస్థను రిజిష్టర్ చేయించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సంస్థ బైలాలో కూడా శివాలయానికి సంబంధించిన సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు, ఇతర సామాజిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ సంస్థ ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొన్నారు.
జీతాలు ప్రభుత్వానివి.. సొసైటీలు ప్రైవేటా?!
ఎండోమెంట్ ఆలయంలో అర్చకులుగా విధులు నిర్వహిస్తూ, ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు తీసుకుంటున్న అర్చకులు, దేవాదాయ శాఖ నుంచి గౌరవవేతనం తీసుకుంటున్న చైర్మన్ శివాలయం పేరుతో మరో సొసైటీని ఏర్పాటు చేయడం అనేది పూర్తిగా చట్టవిరుద్ధమైన చర్య అని ఎండోమెంట్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆలయ పెద్దలే ఇందులో ఉండటం వల్ల ఈ సొసైటీ ఆలయానికి అధికారికంగా సంబంధించిందేనని భ్రమపడి సామాన్య ప్రజలు, శివయ్య భక్తులు ఇతోధికంగా భారీ విరాళాలు ఇచ్చే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన చట్టబద్ధమైన కమిటీ ఉండగా, మళ్లీ ఈ కమిటీలోని వ్యక్తులే దొడ్డిదారిన మరో సొసైటీని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందో తెలియాల్సి ఉంది.
ఈఓ పర్యవేక్షణకు పాతర..
నిబంధనల ప్రకారం ఆలయ ట్రస్టు బోర్డు ద్వారా చందాలు లేదా విరాళాలు వస్తే దానికి తగిన అధికారిక రశీదు ఇచ్చి, ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) పర్యవేక్షణలోనే ట్రస్టు బోర్డు సభ్యులు వాటిని ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతేగాని వ్యక్తిగతంగానో, ప్రైవేట్ సొసైటీల పేరుతోనో చందాలు వసూలు చేయడం, తమకు ఇష్టమొచ్చినట్లు స్వతహాగా ఖర్చు చేయడం ఎండోమెంట్ యాక్ట్‌కు పూర్తిగా విరుద్ధం.
మహా కుంభాభిషేకం వేళ అధికారుల ఆరా!
ఈ వివాదం ఇలా ఉంటే, మంగళవారం (జూన్ 16) నుంచి ‘మహా కుంభాభిషేకం మహోత్సవాలు’ ప్రారంభం కానున్నాయి. సరిగ్గా ఇటువంటి పవిత్రమైన సందర్భంలోనే ఈ అక్రమ సేవాసంఘం వ్యవహారం బయటకు రావడంతో భక్తులలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఈ వ్యవహారాలపై ఉన్నతాధికారులు ఇప్పటికే ఆరా తీస్తున్నట్లు సమాచారం.


