● ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల మోత
● 30 శాతం వరకు పెంపుతో
సామాన్యుడి వెత
కడప ఎడ్యుకేషన్ : ప్రైవేటు, కార్పొరేట్ చదువులు మధ్యతరగతి తల్లిదండ్రులకు మోయలేని భారంగా మారాయి. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ప్రైవేటు పాఠశాలలు ఫీజుల వేటను మొదలుపెట్టాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి ఏకంగా 10 నుంచి 30 శాతం వరకు ఫీజులను పెంచేయడంతో తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 886 ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 1,86,514 మంది విద్యార్థులలో సగానికి పైగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు.ఫీజుల దోపిడీ ఎంత ఘోరంగా ఉందో చెప్పడానికి క్షేత్రస్థాయిలో తల్లిదండ్రుల ఆవేదనే నిదర్శనం.
ఎల్కేజీలో చేర్పించాలంటేనే భయం
కడప నగరంలోని ముత్యాలమ్మకుంటకు చెందిన రాజేష్ అనే లబ్ధిదారుడు తన పాపను ఎల్‌కేజీలో చేర్పించేందుకు ఒక కార్పొరేట్ స్కూల్‌కు వెళ్లగా.. కేవలం స్కూల్ ఫీజే రూ.28,000 అడిగారు. దీనికి తోడు అడ్మిషన్ ఫీజు, పుస్తకాల ఖర్చులు కలిపి ఒక్కసారిగా రూ.35,000 కట్టమనేసరికి అంత ఫీజు ఎలా కట్టాలో తెలియక భయమేస్తోందని ఆయన వాపోయారు.
ఒక్కొక్కరికి రూ.5 వేల నుంచి 7 వేలకు పెంపు
నగరానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతేడాది 3వ తరగతికి రూ.25,000, 5వ తరగతికి రూ.28,000 చొప్పున ఫీజు కట్టాడు. కానీ ఈ ఏడాది ఆ ఫీజులను ఒక్కసారిగా రూ.32,000 మరియు రూ.35,000లకు పెంచేశారు. ఇవి కాకుండా కేవలం పుస్తకాల కోసమే అదనంగా రూ.8 వేల నుండి 10వేలు అడుగుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
హైస్కూల్ భారం
కడప నగరంలో నివసించే ఒక మేసీ్త్ర తన కుమారుడికి 8వ తరగతిలో గతేడాది రూ. 35,000 ఫీజు చెల్లించాడు. ఈ ఏడాది 9వ తరగతికి వచ్చేసరికి ఆ ఫీజును ఏకంగా రూ. 45,000లకు పెంచేశారు. దీనికి తోడు పుస్తకాల కోసమే రూ. 8 వేలకు పైగా వసూలు చేశారు.
డీజిల్ సాకుతో బస్ ఛార్జీల పెంపు
ట్యూషన్ ఫీజులతో పాటు రవాణా, ఇతర సామగ్రి పేరుతో ప్రైవేటు స్కూళ్లు చేస్తున్న నిలువు దోపిడీ సామాన్యుడిని అప్పులపాల్జేస్తోంది. గతేడాది రూ. 10,000 ఉన్న స్కూల్ బస్ ఛార్జీలను ఈ ఏడాది రూ. 15,000లకు పెంచేశారు. దీనిపై యాజమాన్యాలను నిలదీస్తే.. డీజిల్ ధరలు పెరిగాయని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు.
సిలబస్ పేరుతో బ్లాక్‌మెయిల్
పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్, యూనిఫాం, బూట్ల పేరుతో వేలకు వేలు దండుకుంటున్నారు. బయట మార్కెట్లో తక్కువ ధరకు కొందామంటే.. శ్రీఈ బుక్స్ మా స్కూల్ సిలబస్‌కు సంబంధించినవి కావు, మా వద్దే కొనాల్ఙి అంటూ యాజమాన్యాలు కచ్చితంగా నియమం పెడుతూ తల్లిదండ్రుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి.
ఫౌండేషన్ కోర్సులు, ప్రాజెక్టుల పేరిట హడావుడి
చిన్న వయసు నుంచే ఐఐటీ–జేఈఈ, నీట్ ఫౌండేషన్ కోర్సులంటూ పాఠశాలలు సరికొత్త హడావుడిని సృష్టిస్తూ, రెగ్యులర్ ఫీజుకు అదనంగా వేలాది రూపాయలను ఒకేసారి రాబడుతున్నాయి. ఇది చాలదన్నట్లు ప్రాజెక్టు వర్కులు, స్మార్ట్ క్లాసుల పేరిట నిరంతరం అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పులపాలవుతున్నారు.
విద్యాశాఖ తనిఖీలు చేపట్టాలి
జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు పలు రకాల ఫీజుల పేరుతో తల్లిదండ్రుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఈ విషయంలో యాజమాన్యాలు ఎలాంటి ప్రభుత్వ నిబంధనలను పాటించడం లేదు. విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
– అంకన్న, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు


