జమ్మలమడుగు : ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి ఓ చిల్లర డాన్ అని, డబ్బుల కోసం దౌర్జన్యాలు, గుండాయిజం చేసి ఫ్యాక్టరీల నుంచి, కాంట్రాక్టర్‌ల నుంచి చిల్లర తీసుకునే వ్యక్తి అని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి విమర్శించారు. శనివారం ఆయన స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆది అంటేనే అబద్ధం, అరాచకమని అలాంటి వ్యక్తికి.. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే స్థాయి లేదన్నారు. నాలుగు సార్లు నియోజకవర్గ ప్రజలు నమ్మి గెలిపిస్తే.. దాల్మియా కంపెనీ ఇచ్చే చిల్లర డబ్బులకు ఆశ పడి దాల్మియా బాధిత రైతుల కుటుంబాలను తడిగుడ్డతో గొంతు కోసిన వ్యక్తి.. ఎవరైనా ఉన్నారంటే కేవలం ఆదినారాయణరెడ్డి మాత్రమే అన్నారు. దాల్మియా రెండో ప్లాంట్ కోసం చుట్టు పక్కల గ్రామాల ఎన్విరాన్‌మెంట్ ఓపెన్ ఫోరంగా బాధితుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి.. చివరకు దాల్మియాకు దాసోహం అయ్యారన్నారు. అదే విధంగా ఉన్నత స్థానంలో ఉన్న జిల్లా కలెక్టర్ సైతం దాల్మియా బాధిత రైతులకు అన్యాయం చేశారన్నారు. దాల్మియా యాజమాన్యం పెద్దలు.. రైతులకు అన్ని విధాలుగా న్యాయం చేస్తారని తనకు హామీ పత్రం ఇచ్చిన తర్వాతనే.. ఈ సమావేశానికి రావడం జరిగిందని నెల రోజుల్లో ఆర్డీఓ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి న్యాయం చేస్తామని కలెక్టర్ చెప్పారని గుర్తు చేశారు. అయితే రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదని, గ్రామాలను మార్చాల్సిన అవసరం లేదంటూ ఉన్నతాధికారులకు నివేదిక పంపించి రైతులకు, ప్రజలకు మోసం చేశారన్నారు. దీనిపై తాము న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈసీ సభ్యుడు గిరిధర్‌రెడ్డి, అధికార ప్రతినిధి కొమెర్ల మోహన్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, బీసీ నాయకుడు సుబ్రమణ్యం, తలమంచిపట్నం వినయ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


