● వెన్నుపోటుకు రెండేళ్లు ర్యాలీల సక్సెస్‌తో కూటమిపై వ్యతిరేకత ఎంతుందో తెలిసింది
● తిరుపతిలో టీడీపీ విజయోత్సవ సభలో బాబు చెప్పినవన్నీ అబద్దాలే
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
పి. రవీంద్రనాథ్‌రెడ్డి
కడప కార్పొరేషన్: ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుప్పం నుంచి కురుపాం వరకూ అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించిన ర్యాలీలు విజయవంతమయ్యాయని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వంపై ఎంతటి వ్యతిరేకత ఉందో నిన్న జరిగిన ర్యాలీలతో తెలిసిపోయిందన్నారు. కూటమి పాలన అంతానికి ఇది ఆరంభమన్నారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డితో కలిసి ఆయన విలేకరుల తో మాట్లాడారు. ఈ ర్యాలీలకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని శాశ్వతంగా ఇంటికి సాగనంపడం ఖాయమన్నారు. ఈ సారి కూటమిగా వచ్చిన మిమ్మల్ని ఎవ్వరు కాపాడలేరని పేర్కొన్నారు. ఈ రెండేళ్లలో తాము ఎంత ఎంత నష్టపోయామో ప్రజలు లెక్కలేసుకుంటున్నారన్నారు. ‘మీ హామీలు ఏమయ్యాయి... చంద్రబాబు’ అని రాష్ట్ర ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారన్నారు. చంద్రబాబు తన పాలనలో రైతులను, మహిళలను, యువతను, విద్యార్థులను మోసం చేశారన్నారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న పనులకు ఏ మాత్రం పొంతనే లేదని, ప్రతి క్షణం మోసం, ప్రతి పనిలో దగా.. అంతా స్కామ్‌లమయమేనని ధ్వజమెత్తారు. ఈ రెండేళ్లలో రాష్ట్రం చూసింది అభివృద్ధి, సంక్షేమం కాదని, పచ్చి అబద్ధాల ప్రచారమన్నారు. ‘ఇది మంచి ప్రభుత్వమని’ చెప్పుకునే కూటమి పాలనలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయన్నారు. మెగా డీఎస్సీ పేరుతో అనేక అక్రమాలు, అవకతవకలు, స్కామ్‌లతో లక్షల మంది యువత భవిష్యత్తును దారుణంగా దెబ్బతీశారని మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ప్రతి హామీని గుర్తుంచుకుంటున్నారని, ప్రతి మోసాన్ని లెక్కపెడుతున్నారని హెచ్చరించారు. అందువల్లే రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీలు ప్రజల ఆవేదనకు, వ్యతిరేకతకు అద్దంపట్టాయి... వారి ఆగ్రహానికి ప్రతీకగా నిలిచాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో.. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమాలను పరిశీలిస్తే....కూటమికి కౌంట్ డౌన్ మొదలైనట్టే కనిపిస్తోందన్నారు. వైఎస్‌ఆర్ కడప జిల్లాలోనూ కడప, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, రాజంపేట, బద్వేలు ఇలా ఏ నియోజకవర్గం తీసుకున్నా ప్రజావ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్నారు. తిరుపతిలో నిర్వహించిన విజయోత్సవ సభలో సీఎం చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పారని, ఆ సభ ప్రభుత్వ పతనానికి వీడ్కోలు సభలా అనిపించిందన్నారు. రెండేళ్లయినా ఇంకా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై నిందలు వేస్తూ, వైఎస్ జగన్ నామస్మరణ చేయడం సిగ్గుచేటన్నారు. రానున్న రోజుల్లో అన్నివర్గాల అండ, ప్రజాబలం, దేవుడి దయతో ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ పోరాటంలో పాల్గొన్న ప్రజలకు ... వారికి తోడుగా నిలబడిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, యువతకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిశోర్ బూసిపాటి, ఎస్సీసెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్ కుమార్, ఫయాజ్ పాల్గొన్నారు.


