గుర్రంకొండ : అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం చిట్టిబోయనపల్లె రెవెన్యూ గ్రామం ‘పెద్ది’ సినిమాలోని కొండకింద ఊరును తలపిస్తోంది. ఈ ఊరు పరిధిలో సుమారు 328 మంది రైతులకు సంబంధించి 1800 వందల ఎకరాల భూమి ఉంది. రెండేళ్ల వరకు అంటే.. కూటమి కొలువుదీరక ముందు వరకు రెవెన్యూ రికార్డుల్లో ఊరు భద్రంగా ఉంది. భూములకు, వన్‌బీలు, ఆండంగ్‌లు, మ్యూటేషన్లు, ప్రభుత్వ పథకాలు పక్కాగా అందేవి. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక వీరి బతుకు దుర్భరంగా మారింది. ఏకంగా ఊరంతా రెవెన్యూ రికార్డుల్లో మాయమైంది. ఆన్‌లైన్‌లో గ్రామానికి సంబంధించిన ఒక్క రైతు భూమి కనిపించడం లేదు. దీంతో రెండేళ్లుగా ఆగ్రామంలో ఒక్కరికి కూడా రెవెన్యూ సేవలు అందకపోగా రైతులకు సంబంధించిన వ్యవసాయ పథకాలు అందడం లేదు. తాజాగా ప్రభుత్వం రైతు గుర్తింపు కార్డుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్‌సైట్‌లోనూ చిట్టిబోయనపల్లె రెవెన్యూ గ్రామానికి చెందిన వేలాది ఎకరాల భూముల జాడే లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకుల్లో పంట రుణాలు పొందాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరి. ఫలితంగా గ్రామానికి చెందిన328 మంది రైతులు రైతు గుర్తింపు కార్డుల కోసం యుద్ధమే చేస్తున్నారు.
రెండేళ్లుగా రెవెన్యూ సేవలు బంద్
చిట్టిబోయనపల్లె గ్రామానికి సంబందించి రెండేళ్లుగా రెవెన్యూ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. కాగా మరోవైపు తహసీల్దార్ కార్యాలయంలోనూ చిట్టిబోయనపల్లె భూములకు సంబందించి ఎటువంటి మ్యూటేషన్లు జరగడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో బ్యాంకుల్లో రుణాలు పొందిన రైతులు మళ్లీ రీషెడ్యూల్ చేసుకోవాలన్నా ఆన్‌లైన్‌లో అడంగల్, ఒన్‌బీలు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇకమీదట రైతులకు రైతు భరోసా పథకం వర్తించాలంటే తప్పనిరిగా రైతుగుర్తింపు కార్డు ఉండాలనే నిబంధన రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మండల వ్యాప్తంగా 6125 మంది రైతు గుర్తింపు కార్డులు వెబ్‌సైట్‌లో నమోదు చేశారు. అయితే చిట్టిబోయనపల్లె రైతులకు మాత్రం ఇంతవరకు గుర్తింపు కార్డు నమోదు ప్రక్రియ జరగకపోవడం విచారకరం.


