పేదల సొంతింటి కలను సాకారం చేస్తాం! | - | Sakshi
Sakshi News home page

పేదల సొంతింటి కలను సాకారం చేస్తాం!

Jun 14 2026 6:58 AM | Updated on Jun 14 2026 6:58 AM

8.50 లక్షల ఇళ్ల పూర్తి లక్ష్యంతో ముందుకెళ్తున్నాం

మంత్రి కొలుసు పార్థసారథి

ప్రొద్దుటూరు: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖమంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని బొల్లవరం హౌసింగ్‌ లేఅవుట్‌లో శనివారం ఆయన స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డితో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. అక్కడ అసంపూర్తిగా నిలిచిపోయిన గృహ నిర్మాణాలను మంత్రి నిశితంగా పరిశీలించి, లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మెప్మా మహిళా సంఘాలకు సంబంధించిన నిధుల వినియోగంలో సుమారు రూ.48 కోట్ల మేర అవినీతి జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించామని, వాస్తవాలను వెలికితీసి నిధులు పక్కదారి పట్టించినవారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రాష్ట్రవ్యాప్తంగా 8.50 లక్షల ఇళ్ల లక్ష్యం

రాష్ట్రంలో పేదల గృహ నిర్మాణ రంగాన్ని శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4.50 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించామన్నారు. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న మరో 4 లక్షల ఇళ్లను కూడా యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి పేదలకు అందజేస్తామని, ఇళ్ల నిర్మాణంతో పాటు లేఅవుట్లలో తాగునీరు, విద్యుత్‌, డ్రైనేజీ, అంతర్గత రహదారులు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పార్థసారథి తెలిపారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు ఆర్‌డీఓ శిరీష, హౌసింగ్‌ సీఈ వేణుగోపాల్‌, జిల్లా హౌసింగ్‌ పీడీ రాజారత్నం, తహసీల్దార్‌ ఉదయభాస్కర్‌, హౌసింగ్‌ డీఈలు, వివిధ శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement