వెన్నుపోటుపై తిరుగుబాటు | - | Sakshi
Sakshi News home page

వెన్నుపోటుపై తిరుగుబాటు

Jun 13 2026 7:20 AM | Updated on Jun 13 2026 7:20 AM

సాక్షి ప్రతినిధి, కడప : ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘వెన్నుపోటుకు రెండేళ్లు’నిరసన కార్యక్రమం విజయవంతమైంది. సీఎం చంద్రబాబు సర్కార్‌పై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. నియోజకవర్గ కేంద్రాలు శుక్రవారం నిరసన ర్యాలీలతో హోరెత్తాయి. ప్రజల్ని వంచించిన సీఎం చంద్రబాబుకు పాలించే అర్హత లేదంటూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు కదం తొక్కాయి. ప్రజల్ని వంచించిన ముగ్గురు మోసగాళ్లుంటూ ధ్వజమెత్తారు. వేలాది మంది నిరసనలో పాల్గొన్నారు. పులివెందుల పట్టణంలోని పాత ఎమ్మెల్యే కార్యాలయం వద్ద దివంగత వైఎస్‌ జయమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆర్డీఓ కార్యాలయం వరకూ వేలాది మందితో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ యువతకు నిరుద్యోగ భృతి ఏదంటూ మండిపడ్డారు. మహిళలకు ఆడబిడ్డ నిధి ఎక్కడంటూ చంద్రబాబు సర్కార్‌ను నిలదీశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల్ని వంచించడంలో చంద్రబాబు సిద్ధహస్తుడన్నారు.

సూపర్‌ సిక్స్‌ పేరుతో మోసం

జమ్మలమడుగు పట్టణంలో టీటీడీ కల్యాణ మండపం వద్దనున్న దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు నివాళులు అర్పించిన అనంతరం.. నారాపుర స్వామి దేవాలయం మీదుగా పాలగాడిమోట్‌, కాపు వీధి, పెద్దమ్మ మోటు, మార్కెట్‌ వీధి మీదుగా పాత బస్టాండ్‌ వరకూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు సర్కార్‌ అన్నీ వర్గాల ప్రజల్ని మోసం చేసిందని ధ్వజమెత్తారు. రాజకీయాలతో నిమిత్తం లేకుండా పేదల సంక్షేమమే ఎజెండాగా వైఎస్సార్‌సీపీ నేతృత్వంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలిస్తే, తద్భిన్నంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బద్వేల్‌ పట్టణంలో సిద్దవటం రోడ్డులో ఉన్న వైఎస్సార్‌ విగ్రహం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగించారు. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు సుమారు 145 హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ విస్మరించారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే డాక్టర్‌ సుధా మాట్లాడుతూ నిరుద్యోగుల జీవితాలతో సర్కార్‌ ఆటలు ఆడుతోందని, డీఎస్సీలో సైతం అక్రమాలకు అవకాశాలు కల్పించారని ఆరోపించారు. రాజంపేటలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహం నుంచి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ టీడీపీ మ్యానిఫెస్టో పత్రాలను దగ్ధం చేశారు. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి మాట్లాడుతూ సూపర్‌ సిక్స్‌ పథకాలంటూ చంద్రబాబు పంగనామాలు పెట్టారని ఎద్దేవా చేశారు. కమలాపురంలో గ్రామ చావిడి వద్ద నుంచి తహసిల్దార్‌ కార్యాలయం వరకూ ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు మోసాలతో ప్రజలు విసిగిపోయారని, నీతి తప్పిన రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్టగా వర్ణించారు. నియోజకవర్గ ఇన్‌చార్జి పోచంరెడ్డి నరేన్‌రామాంజులరెడ్డి మాట్లాడుతూ దగా పడ్డ ఆంధ్రప్రదేశ్‌ను మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే కాపాడగలరన్నారు. చంద్రబాబు సర్కార్‌ను ప్రజలు బంగాళఖాతంలో కలపనున్నట్లు తెలిపారు.

ముగ్గురు మోసగాళ్ల శైలిపై ధ్వజం

ప్రొద్దుటూరులో మున్సిపల్‌ ఆఫీసు నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో పార్టీ రంగులతో కూడిన గొడుగులు ఆకర్షణీయంగా దర్శనమిచ్చాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు, నారా లోకేష్‌, పవన్‌కళ్యాణ్‌ కలిసికట్టుగా ప్రజల్ని మోసం చేశారని ధ్వజమెత్తారు. ముగ్గురు మోసగాళ్లకు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మైదుకూరు పట్టణంలో ప్రొద్దుటూరు రోడ్డులో ఉన్న మూలబాట నుంచి కడప రోడ్డులోని వైఎస్సార్‌ విగ్రహం వరకూ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ దేశంలో అతిపెద్ద మోసగాడు చంద్రబాబేనని తెలిపారు. జీవితమంతా ప్రజల్ని వంచించడమేనని విమర్శించారు. కడప నగరంలో పార్టీ జిల్లా కార్యాలయం నుంచి కోటిరెడ్డిసర్కిల్‌, ఎన్టీఆర్‌ సర్కిల్‌, ఏడురోడ్ల కూడలి మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. సమన్వయకర్త, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా మాట్లాడుతూ అపరమేధావి ప్రపంచానికే పాఠాలు చెప్పానని చెప్పుకొనే చంద్రబాబు అమలు చేయలేని హామీలు ఇచ్చి గద్దెనెక్కారన్నారు. మాజీ మేయర్‌ సురేష్‌బాబు మాట్లాడుతూ కూటమి సర్కార్‌లో అరాచకాలు, దౌర్జన్యాలు అధికం అయ్యాయని తెలిపారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని కాబట్టే వైఎస్సార్‌సీపీకి విశేష మద్దతు లభిస్తోన్నట్లు వివరించారు. ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ స్కామ్‌లమయం అయ్యిందని, పరీక్ష రాయని వారికి కూడా ఉద్యోగాలు కట్టబెట్టారని, సీబీఐ విచారణ చేయించాలని కోరితే సర్కార్‌ తోకముడుస్తోందన్నారు. జిల్లా వ్యాప్తంగా నిరసన ర్యాలీలో పెద్ద ఎత్తున శ్రేణులు పాల్గొని కదం తొక్కాయి. ప్రజలు ఎక్కడికక్కడ భారీగా పాల్గొని పెద్ద ఎత్తున మద్దతు తెలియజేయడం విశేషం.

కదం తొక్కిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు

వంచించిన చంద్రబాబుకు పాలించే

అర్హతలేదని మండిపాటు

హామీలు అమలు చేయకపోవడంపై ప్రజల ఆగ్రహం

నియోజకవర్గ కేంద్రాల్లో వెల్లువెత్తిన

నిరసన ర్యాలీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement