– సోషల్ మీడియాలో వీడియో వైరల్
జమ్మలమడుగు : తాళ్లప్రొద్దుటూరు ఎస్‌ఐ మంజునాథ్‌రెడ్డి వేధిస్తున్నారని ఆరోపిస్తూ పట్టణ పరిధి బెడుదూరుకు చెందిన మనోజ్ శుక్రవారం వీడియో రికార్డు చేసి పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. స్థానికులు ఆయనను తాడిపత్రిలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి బంధువుల వివరాల ప్రకారం.. మనోజ్ గతంలో బెడుదురులో రెండెకరాల భూమి కొనుగోలు చేశారు. కొన్ని రోజుల తర్వాత భూమి విక్రయించిన రైతు బంధువులైన గురుశేఖర, లక్షుమయ్య రెండెకరాల భూమిని తమకు తిరిగి ఇవ్వాలంటూ మనోజ్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతోపాటు పోలీసులను ఆశ్రయించారు. తాళ్లప్రొద్దుటూరు ఎస్‌ఐ మంజునాథ్ వద్ద పంచాయితీ పెట్టించారు. ఈ కేసుకు సంబంధించి మనోజ్ హైకోర్టు నుంచి ఎస్‌ఐకి నోటీసులు పంపించారు. దీన్ని మనసులో పెట్టుకుని ఎస్‌ఐ వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపిస్తున్నారు. ఎస్‌ఐతోపాటు మరికొందరు రాజకీయంగా ఒత్తిడి తీసుకొచ్చి మనోవేదనకు గురి చేస్తుండటంతోనే ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు ఆరోపిస్తున్నారు.
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ యార్డు గోడౌన్‌లో ఉన్న 268 టన్నుల స్టీల్ దొంగతనం విషయం హౌసింగ్ పీడీతోపాటు మరికొందరి అధికారుల పాత్ర ఉందని ఈ కేసులో సస్పెండ్ అయిన రూరల్ ఏఈ కేఎల్ సుబ్రహ్మణ్యం తెలిపారు. పోలీసు కేసు నమోదైన సుబ్రహ్మణ్యం ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పీడీ సూచన మేరకు ముందస్తు బెయిల్ కోసం తాను ఊరు వదిలి వెళ్లానని చెబుతూ శుక్రవారం వీడియో రిలీజ్ చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎవరికి స్టీల్, సిమెంట్ అదనంగా ఇవ్వలేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ నిల్వలను అలాగే ఉంచాలని హౌసింగ్ ఎండీ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. గతేడాది విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేసి స్టీల్ నిల్వలు ఉన్నా యని ధ్రువీకరించారన్నారు. ఈ ఏడాది మొదట్లోనే స్టీల్ మాయమైందన్నారు. అధికారులు 268 టన్నులు మాయమైనట్లు చెబుతున్నారని, వాస్తవానికి 212 టన్నులు మాత్రమే అని తెలిపారు. సంస్థలో పని చేస్తున్న వర్క్ ఇన్‌స్పెక్టర్ జయ నరసింహులు, రవికుమార్, ఏఈ టీకే ప్రతాప్‌రెడ్డి, ఈఈ రాజశేఖర్‌ల పాత్రపై తనకు అనుమానం ఉందన్నారు. వర్క్ ఇన్‌స్పెక్టర్ జయ నరసింహులు కోట్ల రూపాయలు అక్రమా స్తులు సంపాదించాడన్నారు. తాను అవినీతికి పాల్పడలేదని, గతంలోనే బద్వేలు మండలానికి అదనపు విధులు నిర్వహించాలని పీడీ సూచించారన్నారు. తానే వద్దని వెళ్లలేదని తెలిపారు.


