బాబు హామీ మూగబోయింది | - | Sakshi
Sakshi News home page

బాబు హామీ మూగబోయింది

Jun 12 2026 5:39 AM | Updated on Jun 12 2026 5:39 AM

అరకొరగానే విద్యాకానుక

నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం

నేటికీ రాని బ్యాగులు, షూ, బెల్ట్‌,

డిక్షనరీలు

కడప ఎడ్యుకేషన్‌ : కూటమి మాట ఒట్టిమాటేనని తేలిపోయింది.. బడాయి మాటలు చెప్పడం ఆపై వెనకడుగు వేయడం ప్రభుత్వ పెద్దలకు అలవాటుగా మారింది. పాఠశాలలు తెరిచేనాటికి విద్యాకానుక ఇస్తామని సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్‌ చెప్పిన హామీలు నీటి మూటగానే మిగిలింది. జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభంకానున్నాయి. విద్యాకానుక కోసం ఎదురు చూస్తున్న పిల్లల ఆశలపై బాబు సర్కారు నీళ్లు చల్లింది. ఇప్పటి వరకు తొలి విడతగా యూనిఫాం, నోట్‌బుక్స్‌, టెక్స్‌బెక్స్‌, వర్కుబుక్స్‌, డిక్షనరీలు మాత్రమే పంపిణీ చేయ నుంది. మిగతా బ్యాగులు, బూట్లు, సాక్సులు, బెల్‌తోపాటు డిక్షనరీలు అసలుకే రాలేదు. బుక్స్‌ ఇస్తారు సరే .. ఆ పుస్తకాలను ఎక్కడ పెట్టుకోవాలోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

అరకొరగా విద్యాకానుక వస్తువులు....

జిల్లావ్యాప్తంగా 40 మండలాల్లో 2425 పాఠశాలలు ఉన్నాయి, ఇందులో 1,37,498 మంది విద్యార్థులు ఉన్నారు. నోట్‌బుక్స్‌(6వ తరగతి నుంచి 10వ తరగతి) 7,24,453 రావాల్సి ఉండగా ఇప్పటి వరకు 717428 రాగా ఇంకా 7025 నోట్‌బుక్స్‌ రావాల్సి ఉంది. ఇక వర్కుబుక్స్‌ 5967, టెక్స్‌ బుక్స్‌ 29172 రావాల్సి ఉంది. ఇక బ్యాగులు, బె ల్ట్‌, ఆక్స్‌పర్డ్‌ డిక్షనరీ(6వ తరగ తి)సంబంధించి షూ, సాక్సులు ఒక్కటీ పాఠశాలలకు చేరలేదు.

జగన్‌ హయాంలో

తొలిరోజే విద్యాకానుక..

గత వైఎస్సార్‌సీపీ సర్కార్‌ పాఠశాలలు పునః ప్రారంభంరోజే విద్యార్థులకు విద్యాకానుక కిట్‌ అందించేది. దీంతో పిల్లల ముఖంలో ఆనందం వెల్లివిరిసేది. విద్యాకానుక కిట్‌లో పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, వర్క్‌బుక్‌లు, మూడు జతల యూనిఫాం, స్కూల్‌ బ్యాగు, జత షూ, రెండు జతల సాక్సులు, బెల్ట్‌లు ఉండేవి, దీంతోపాటు యూనిఫాంకు సంబంధించి కుట్టుకూలి కూడా ప్రభుత్వమే చెల్లించేది. నెల రోజుల ముందుగానే విద్యార్థుల పాదాల కొలతలు తీసుకుని అందుకు తగ్గట్టుగా షూ పంపేవారు. దీంతో తల్లిదండ్రులపై ఆర్థికబారం పడేదికాదు, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు కూడా ఇంకా బ్యాలెన్సే పెట్టింది. దీంతో పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు.

వారంలో అన్నీ అందజేస్తాం...

విద్యాకానుకకు సంబంధించి ఇంకా రాని వస్తువులను వారం రోజుల్లో అందజేస్తాం. యుద్ధం కారణంగా కొన్ని వస్తువుల వచ్చే దానికి ఆలస్యమైంది. అవి రాగానే పిల్లలకు అందచేస్తాం. విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందవద్దు. – షేక్‌ షంషుద్దీన్‌,

జిల్లా విద్యాశాఖ అధికారి.

విద్యా కానుక వివరాలు ఇలా..

కాంపోనెంట్‌ ఇండెంట్‌ వచ్చినవి రావాల్సినవి

బ్యాగ్స్‌ 129654 0 129654

బెల్టులు 89472 0 89472

ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ 11758 0 11758

(6వ తరగతి)

షూ అండ్‌ సాక్స్‌ 129654 0 129654

నోట్‌బుక్స్‌ 724453 71,7428 7025

(6 నుంచి 10)

వర్కు బుక్స్‌ 120996 115029 5967

టెక్స్‌ బుక్స్‌ 565852 536680 29,172

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement