కడప ఎడ్యుకేషన్: పది ఫలితాల విడుదలపై వాట్సప్ గ్రూపుల్లో వస్తున్న వదంతులను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నమ్మొద్దని జిలా విద్యాశాఖ అధికారి షేక్ షంషుద్దీన్ తెలిపారు. శుక్రవారం చాలా వాట్సప్ గ్రూపుల్లో 25వ తేదీన పది ఫలితాలు విడుదలవుతున్నట్లు ప్రకటనలు వచ్చాయని, ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమేనని అన్నారు. పది ఫలితాలు ఈ నెలాఖరులో కానీ, మే మొదటి వారంలో గాని విడుదలవుతాయని పేర్కొన్నారు. వాట్సప్‌ల్లో ఇలాంటి పోస్టులను పెట్టేవారి పట్ల చర్యలు తీసుకోవాలని కోరారు.
వల్లూరు: పవిత్ర పుణ్య క్షేత్రమైన పుష్పగిరిలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో శుక్రవారం స్వామి వారి హుండీల ఆదాయాన్ని లెక్కించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారిని దర్శించుకున్న భక్తులు హుండీల ద్వారా సమర్పించుకున్న కానుకలను కొండపైన గల శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి ఆలయంలో దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో లెక్కించారు. మార్చి 26 వ తేదీ నుండి ఏప్రిల్ 24 వ తేదీ వరకు శాశ్వత హుండీల ద్వారా రూ 3,35,860 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో శ్రీనివాసులు తెలిపారు. కాగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక హుండీల ద్వారా రూ 94,950, సేవా టికెట్ల ద్వారా రూ 1,37,880, అన్న దానం కోసం ఇచ్చిన చందాల ద్వారా రూ 1,00,708 వచ్చిందని, దీంతో మొత్తం కలిపి రూ 6,69,398 ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సీనియర్ అసిస్టెంట్ రవి శేఖర్ రెడ్డి, ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ డీ సుబ్బారెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు అఖిల్ దీక్షితులు, పోలీసు సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
కడప అగ్రికల్చర్: జిల్లాలో పంటలు సాగు చేసిన రైతులకు మాత్రమే డీలర్లు ఎరువుల అమ్మకాలు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి మట్టా సుబ్రమణేశ్వరరావు సూచించారు. కడప కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లాలోని ఏడీఏలు, మార్కెఫెడ్ డీఎం ఎరువుల కంపెనీ ప్రతినిధులు, హోల్‌సేల్ డీలర్లతో ఎరువులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ యూరియా జిల్లాకు వచ్చిన తర్వాత మార్కెఫెడ్ ద్వారా రైతు సేవా కేంద్రాలకు, కొంత డీలర్లకు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. డీలర్లు ఎరువులను పంట సాగు చేసిన రైతులకు మాత్రమే విక్రయించాల్సి ఉంటుందన్నారు. పంటలు సాగు చేయని రైతులు కూడా ముందు జాగ్రత్తగా ఎరువులను కొనుగోలు చేసి నిల్వ ఉంచుకునేందుకు ప్రయత్నిస్తారని అలాంటి వారి గుర్తించి ఇవ్వకుండా ఆపాలన్నారు. ఈ విషయంలో ఏడీఏలతోపాటు మండల వ్యవసాయ అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మార్కెఫెడ్ డీఎం పరిమళజ్యోతి, జేడీ కార్యాలయ ఏడీఏ మాధవి తదితరులు పాల్గొన్నారు.
కడప సెవెన్‌రోడ్స్: ఈ నెల 30వ తేదీన కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ పరిసరాల్లోని అదీప్ ల్యాబొరేటరీ యూనిట్‌లో నిర్వహిస్తున్న ఆఫ్–సైట్ ఎమర్జెన్సీ మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని ప్రతిఒక్కరూ చేపట్టి విజయవంతం చేయాలని జిల్లా ఇన్చార్జి డీఆర్వో వెంకటపతి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా విపత్తుల నిర్వహణపై సంబందిత జిల్లా అధికారులతో జిల్లా ఇన్‌చార్జి రెవెన్యూ అధికారి సమీక్షా సమావేశం నిర్వహింహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా అత్యవసర పరిస్థితుల నిర్వహణ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు, ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడానికి ఈ నెల 30వ తేదీన ఆఫ్–సైట్ ఎమర్జెన్సీ మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మాక్ డ్రిల్ ప్రక్రియ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ మార్గదర్శకాల ప్రకారం నిర్వహించబడుతుందన్నారు. జిల్లాలోని కొప్పర్తి పరిశ్రమల ప్రాంతంలో ఉన్న అడీప్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు సమీపంలోని పరిశ్రమల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ మాక్ డ్రిల్ ప్రక్రియలో భాగంగా అగ్ని ప్రమాదం, ప్రమాదకర రసాయనాల లీకేజీ వంటి అత్యవసర పరిస్థితులను మోడల్ రూపంలో ప్రదర్శించి, సంబంధిత విభాగాల సమన్వయాన్ని పరీక్షించనున్నారన్నారు. కార్యక్రమంలో కడప ఆర్డీవో మురళి, ఇండస్ట్రీస్ ఇన్‌స్పెక్టర్ చీఫ్ చిన్నారావ్ తదితరులు పాల్గొన్నారు.


