కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి

Apr 25 2026 7:36 AM | Updated on Apr 25 2026 7:36 AM

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి

బద్వేలు అర్బన్‌: జిల్లాలో రైతులు పెద్ద ఎత్తున వరిపంటను సాగు చేసిన నేపథ్యంలో తక్షణమే ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం బద్వేలుకు విచ్చేసిన ఆయనను స్థానిక నెల్లూరురోడ్డులోని మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ రాజగోపాల్‌రెడ్డి వ్యక్తిగత కార్యాలయంలో పలువురు రైతులు కలిసి సమస్య తెలియజేశారు. వెంటనే స్పందించిన ఆయన సివిల్‌ సప్‌లైస్‌ ఎండీతో మాట్లాడటంతో పాటు జిల్లా కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్‌లో 1.75 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి కోతదశకు వచ్చిందని, అయితే మార్కెట్‌లో 78 కేజీల బస్తా రూ.1500లకే దొరుకుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని, ఈ మేరకు కనీస మద్దతు ధర రూ.1830 లతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. ఇప్పటికే ప్రభుత్వం సకాలంలో స్పందించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వలన పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారని, ఆ పరిస్థితి మళ్ళీ రాకుండా తక్షణమే వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఇప్పటికే ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చిందని, త్వరలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటామని కలెక్టర్‌ హామీ ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు. కార్యక్రమంలో రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు.

కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడిన

ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement