కడపలో యువకుడి దారుణ హత్య
కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప నగరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమీన్‌పీర్ దర్గా ఉరుసు మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇద్దరు యువకుల మధ్య గతంలో ఏర్పడిన మనస్పర్ధల కారణంగా ఉర్సుకు సమీపంలో ఎగ్జిబిషన్ జరిగే ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి యువకుడిని కత్తితో దారుణంగా పొడిచి హత్య చేసిన సంఘటన కడప నగరంలో సంచలనం కలిగించింది. ఈ సంఘటన కడప టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోనే జరగడం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ హత్య సంఘటనపై పోలీసులు, మృతుని బంధువులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కడప నగరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుమ్మరికుంటకు చెందిన సయ్యద్ అబూబకర్ అలియాస్ గౌస్ బాషా(25) కు, కడపకు చెందిన అబూజార్, యూసఫ్ ల మధ్య గతంలో మనస్పర్ధలు ఉండేవి. శనివారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో అబూబకర్ ఉరుసుకు వచ్చాడు. అదే సమయంలో నిందితులు, మరో ఏడుగురు స్నేహితులతో కలిసి అబూబకర్ కి ఎదురుపడ్డారు. వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో యూసఫ్ తన వద్ద ఉన్న కత్తి తీసుకుని అబూబకర్ పొట్టలో గట్టిగా పొడిచి చీల్చివేశాడు. దీంతో రక్తపు మడుగులో అబూబకర్ తీవ్ర గాయాల పాలయ్యాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అబూబకర్‌ను చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు. తీవ్రంగా గాయపడిన యువకుడు రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కడప టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనలో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
పోలీసుల అదుపులో నిందితులు?


