ఎగ్జిబిషన్ బకాయిలు చెల్లించే వరకు దీక్ష ఆగదు
ప్రొద్దుటూరు : ప్రజాధనమైన ఎగ్జిబిషన్ బకాయిలు చెల్లించే వరకు తాము చేపట్టిన రిలే నిరాహార దీక్షను ఆపే ప్రసక్తే లేదని, పోలీసులు అనుమతించకపోతే చివరికి తమ ఇళ్లల్లో అయినా నిరసన దీక్షలు చేపడుతామని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ఎగ్జిబిషన్ బకాయిలను చెల్లించాలని కోరుతూ స్థానిక గాంధీ రోడ్డులోని ప్రైవేట్ స్థలంలో సోమవారం మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు గోసా మనోహర్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షా శిబిరాన్ని సందర్శించి రాచమల్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పదేళ్లలో అనేక మంది కాంట్రాక్టర్లు ఎగ్జిబిషన్ బకాయిలను చెల్లించకపోవడంతో ఈ ఏడాది మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేశారన్నారు. వేలం పాట పాడిన కాంట్రాక్టర్ జీఎస్టీతో సహా పూర్తి డబ్బు చెల్లించిన తర్వాత కానీ, అలా లేని పరిస్థితుల్లో బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చిన తర్వాత కానీ ఎగ్జిబిషన్ నడుపుకొనే హక్కు కల్పించేలా కౌన్సిల్ తీర్మానం చేసిందన్నారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, ఆయన కుమారుడు కొండారెడ్డి అండతో ఎగ్జిబిషన్ దక్కించుకున్న టీడీపీ కాంట్రాక్టర్ మాడెం సుధాకర్‌రెడ్డి పూర్తి డబ్బు చెల్లించకుండానే ఎగ్జిబిషన్ నిర్వహించారన్నారు. నేతల సిఫారసుతో కమిషనర్ కాంట్రాక్టర్‌కు వర్క్ ఆర్డర్ ఇచ్చారన్నారు. దసరా సందర్భంలో వర్షం పడకపోవడంతో కాంట్రాక్టర్ ప్రవేశ రుసుం రూ.35కు బదులు రూ.100 వసూలు చేసి లాభం ఆర్జించినా ఇంత వరకు పూర్తి డబ్బు చెల్లించలేదన్నారు. ఈ కారణంగానే ప్రజాధనం దుర్వినియోగం కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభించామని తెలిపారు.
డీఎంఏకు హైకోర్టు నోటీసులు
ఎగ్జిబిషన్ కాంట్రాక్టర్ నుంచి డబ్బు వసూలు చేయలేదని తాము హైకోర్టును ఆశ్రయించడంతో డైరెక్టరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసిందని రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. జీఎస్టీతో సహా మొత్తం రూ.2.25 కోట్లు వసూలు చేయాలని కోర్టు నోటీసులో పేర్కొందన్నారు. దీంతో మున్సిపల్ కమిషనర్‌పై ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరిగిందని, ప్రజాధనాన్ని కట్టించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.
పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ప్రైవేట్ స్థలంలో.. దీక్ష
పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో గాంధీ రోడ్డులోని ప్రైవేట్ స్థలంలో రిలే నిరాహార దీక్ష చేపట్టినట్లు రాచమల్లు తెలిపారు. డీఎస్పీ భావనతో వారం రోజుల వరకు అనుమతి తీసుకున్నామని, ప్రస్తుతం డీఎస్పీ సెలవులో ఉండటంతో ఇన్‌చార్జి డీఎస్పీ ఉన్నారన్నారు. ఆయన అనుమతి ఇవ్వని కారణంగా ప్రైవేట్ స్థలంలో దీక్ష చేపట్టామని, కాంట్రాక్టర్ డబ్బు చెల్లించే వరకు పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. ఇక్కడ కూడా పోలీసులు అభ్యంతరం చెబితే మరో చోట చేస్తామని, అక్కడా అనుమతించకపోతే చివరికి తమ ఇళ్లలో ఉండి అయినా దీక్ష చేస్తామని తెలిపారు. సాయంత్రం మున్సిపల్ చైర్‌పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి దీక్షను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ జేషాది శారద, ఎంపీపీ శేఖర్ యాదవ్, కోఆపరేటివ్ స్టోర్స్ అధ్యక్షురాలు గజ్జల కళావతి, మా జీ కౌన్సిలర్లుటప్పా ౖగైబుసాహెబ్, పిట్టా భద్రమ్మ, వైఎస్సార్‌సీపీ నేతలు జంగమయ్య యాదవ్, మాజీ సర్పంచ్ దేవీప్రసాద్‌రెడ్డి, బీసీ కార్పొరేషన్ల మాజీ డైరెక్టర్లు తుపాకుల వెంకటరమణ పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి


