రేషన్ బియ్యం స్మగ్లర్, డ్రైవర్ అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం : రేషన్ బియ్యం స్మగ్లర్‌తో పాటు వాహన డ్రైవర్‌ను వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. బొలెరో వాహనంతో సహా 20 రేషన్ బియ్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ వివరాలను వన్‌టౌన్ సీఐ తిమ్మారెడ్డి సోమవారం రాత్రి విలేకరులకు వెళ్లడించారు. రెండు రోజుల క్రితం రామేశ్వరం రోడ్డులో రేషన్ బియ్యం వాహనం వెళ్తుండగా ఇద్దరు ఎస్బీ కానిస్టేబుళ్లు అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే ఇరువురు కానిస్టేబుళ్లు ఉండగానే రేషన్ బియ్యం స్మగ్లర్ వాహనంతో పరారయ్యాడు. ఈ క్రమంలో పోలీసులపైకి వాహనం వెళ్తుండగా వారు పక్కకు తప్పుకున్నారు. దీంతో వారికి ప్రమాద గండం తప్పినట్‌లైంది. కాగా.. ప్రత్యేక పోలీసు బృందాలతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆదివారం వాహనంతో సహా 20 రేషన్ బియ్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
డ్రైవర్‌తో సహా బియ్యం వ్యాపారి అరెస్ట్
రామేశ్వరం రోడ్డులో నిందితులు ఉన్నారని సమాచారం రావడంతో సీఐ తిమ్మారెడ్డి సిబ్బందితో కలిసి సోమవారం దాడులు నిర్వహించారు. దాడిలో రేషన్ బియ్యం స్మగ్లర్ మండి సుబ్బయ్య, డ్రైవర్ జయన్నలను అరెస్ట్ చేశారు. వీరిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని సీఐ పేర్కొన్నారు. మండి సుబ్బయ్య కుమారుడు, ప్రధాన రేషన్ బియ్యం స్మగ్లర్ సృజన్ పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు.


