తెలుగుకు వెలుగునిచ్చిన మహనీయుడు బ్రౌన్
వైవీయూ వీసీ
ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్
కడప ఎడ్యుకేషన్: తెలుగు భాషా సాహిత్యాలకు సీపీ బ్రౌన్ ఎనలేని సేవ చేశారని వైవీయూ ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ పేర్కొన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో సోమవారం ’తెలుగు సూర్యుడు’సి.పి.బ్రౌన్ 227వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ ముందుగా రాజీవ్ మార్గ్‌లోని బ్రౌన్ విగ్రహానికి, సిపి బ్రౌన్ సమావేశ మందిరంలోని సి.పి.బ్రౌన్ చిత్రపటానికి అతిథులతో కలసి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ తెలుగుకు శాశ్వత వెలుగునిచ్చిన మహనీయుడు ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అని కొనియాడారు. విశిష్ట అతిథి, యోగి వేమన విశ్వవిద్యాలయం ఇన్చార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య పుత్తా .పద్మ, సభాధ్యక్షులు, సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సంచాలకులు ఆచార్య జి.పార్వతి తదితరులు మాట్లాడారు. సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు చింతకుంట శివారెడ్డి, భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి సభా సమన్వయం చేశారు. జానమద్ది విజయభాస్కర్, విజయలక్ష్మి దంపతులు హనుమచ్ఛాస్త్రి శతజయంతిని పురస్కరించుకొని విశ్వవిద్యాలయ అధికారులను, బ్రౌన్ గ్రంథాలయ సిబ్బందిని సత్కరించారు. తెలుగుశాఖ ఆచార్యులు ఎన్.ఈశ్వరరెడ్డి, ఎం.ఎం.వినోదిని, పి.రమాదేవి, పుత్తా పుల్లారెడ్డి, పుత్తా బాలిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
బ్రౌన్ భాషా, సాహితీ సేవలు ప్రశంసనీయం
కడప సెవెన్‌రోడ్స్: సీపీ బ్రౌన్ తెలుగుభాషా సాహిత్యాలకు అందించిన సేవలు ప్రశంసనీయమని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు అన్నారు. బ్రౌన్ 227వ జయంతిని పురస్కరించుకుని కడప ఆఫీసర్స్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని బ్రౌన్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఆఫీసర్స్ క్లబ్ సభ్యులు జానమద్ది విజయభాస్కర్ బ్రౌన్ సాహిత్య సేవ గురించి వివరించారు. కోశాధికారి వీరభద్రయ్య, క్లబ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
తెలుగుకు వెలుగునిచ్చిన మహనీయుడు బ్రౌన్


