పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ముద్దనూరు : గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఓబుళమ్మ పేర్కొన్నారు. సోమవారం ఆమె డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి రామాంజనేయులుతో కలిసి మండలంలోని కొత్తపల్లె గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్ళి చెత్త సేకరిస్తున్నారా లేదా అని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ కాలనీలో మురుగునీటి ప్రవాహంతో ఇబ్బంది పడుతున్నామని కాలనీవాసులు సీఈవో దృష్టికి తెచ్చారు. తక్షణమే మురుగునీటి కాలువ పూడిక తీయించారు. స్థానిక ప్రాథమిక పాఠశాల ఆవరణలో వర్షంనీరు నిలుస్తోందని ప్రజలు తెలపడంతో ఇంకుడుగుంతలు ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాధాకృష్ణాదేవి తదితరులు పాల్గొన్నారు.


