సంపద సృష్టి.. నారా కుటుంబానికే!
కమలాపురం: ఎన్నికల ముందు సంపద సృష్టిస్తా అని చెప్పిన చంద్రబాబు ఆ సంపద ప్రజల కోసం కాదని, కేవలం నారా వారి కుటుంబానికే అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. సోమవారం కమలాపురంలోని ఆర్టీసీ బస్టాండు వద్ద వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా నిర్వహించిన రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్‌ఈసీ సభ్యుడు సాయినాథ శర్మతో కలసి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 17నెలలైందని, ఈ కాలంలో రూ. 2.27లక్షల కోట్లు అప్పు చేసిందని, ఆ అప్పుతో రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదని మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవడం చంద్రబాబు నైజమని దుయ్యబట్టారు. గతంలో ఆయన సీఎంగా ఉన్న సమయంలో సైతం పాల ఫ్యాక్టరీలు, స్పిన్నింగ్ మిల్లులు, చక్కెర, ఆల్వీన్ ఫ్యాక్టరీలన్నీ అమ్ముకున్నారన్నారు. ప్రస్తుతం ఆయన కన్ను వైద్య కళాశాలలు, ఆసుపత్రులపై పడిందన్నారు. 50 ఎకరాల విస్తీర్ణంలో అన్ని హంగులతో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలలను తన అనుయాయులకు కట్టబెట్టేందుకు పీపీపీ విధానం అంటూ చంద్రబాబు కుట్ర పన్నుతున్నాడని అదే జరిగితే పేదలకు వైద్యంతో పాటు వైద్య విద్య దూరం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని గవర్నర్‌కు కోటి సంతకాల ద్వారా తెలియజేయాలని జగనన్న చేపట్టిన ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు.
12న జరిగే ర్యాలీని విజయవంతం చేయండి
ప్రైవేట్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం భాగంగా ఈ నెల 12న జరగనున్న ర్యాలీని విజయవంతం చేయాలని రవీంద్రనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని ప్రతి గ్రామం నుంచి వైఎస్సార్ సీపీ నాయకుల, కార్యకర్తలు విరివిగా పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు.
చరిత్ర సృష్టించిన జగనన్న: సాయినాథ శర్మ
మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఒకే సారి 17 మెడికల్ కళాశాలలను తీసుకువచ్చి చరిత్ర సృష్టించారని రాష్ట్ర ఎస్‌ఈసీ సభ్యుడు సాయినాథ శర్మ తెలిపారు. బ్రిటీష్ హయాం నుంచి 2019 వరకు కేవలం 12 కళాశాలలు మాత్రమే వచ్చాయని, అందులో మహానేత 7 మెడికల్ కళాశాలలు తీసుకొచ్చారన్నారు. 16ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు కేవలం 2 కళాశాలలు మాత్రమే అవి కూడా ప్రైవేట్ కళాశాలలు అని స్పష్టం చేశారు. జగనన్న మాత్రమే దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా కేవలం 5ఏళ్లలో 17 మెడికల్ కళాశాలలు తీసుకువచ్చారని గుర్తు చేశారు. మండల, టౌన్ కన్వీనర్లు ఉత్తమారెడ్డి, గంగాధర్ రెడ్డి, రాజుపాళెం సుబ్బారెడ్డి, సుమిత్రా రాజశేఖర్ రెడ్డి, వంశీధర్ రెడ్డి, ఇస్మాయిల్, హిదాయత్, సునీల్‌రెడ్డి, సుధా కొండారెడ్డి, మోహన్ రెడ్డి, మహ్మద్ సాదిక్, గఫార్, ఇర్ఫాన్, ఖాజా హుసేన్, జావీద్, దేవదానం, నగేష్, సుదర్శన్ రెడ్డి, గౌస్ మున్నా, షావలి, జిలానీ బాషా, మోనార్క్, అంబటి సురేష్, ఖాజా, శివ క్రిష్ణారెడ్డి, విశ్వం, రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్ముకోవడమే చంద్రబాబు పని
రూ. 2.27లక్షల కోట్ల అప్పు ఏమైంది?
ప్రభుత్వంపై ధ్వజమెత్తిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి


