
ఆసుపత్రిలో పాము కలకలం
జమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో పాము ఆదివారం కలకలం రేపింది. ఆసుపత్రి వెనుక భాగంలో ఖాళీ ప్రదేశం ఉండడం, ఇటీవల వర్షాలు పడడంతో గర్భిణులు ఉండే వార్డులోకి పాము ప్రవేశించింది. గమనించిన రోగులు ఆసుపత్రి సిబ్బందికి తెలిపారు. సెక్యూరిటీ వచ్చి కర్రతో కొట్టి చంపివేయడంతో రోగులు ఊపిరి పీల్చుకున్నారు.
పల్లెల్లో జోరుగా పేకాట
సాక్షి టాస్క్‌పోర్స్ : కొండాపురం మండలంలోని కొన్ని గ్రామాల్లో కూటమి నాయకుల కనుసన్నుల్లో పేకాట జోరుగా సాగుతోంది. యర్రగుడి పునరావాస కేంద్రం సమీపంలోని సపోట తోట, దొబ్బుడుపల్లె పమీపంలోని కంపచెట్ల వద్ద, కె.సుగుమంచిపల్లె పునరావాస కాలనీలోని చెట్ల వద్ద, కొండాపురం ఈసర్ పెట్రోల్ బంకు సమీపంలోని ఓ చీనీ తోటలో చాలామంది పేకాట ఆడుతున్నట్లు తెలుస్తోంది. పోలీసులకు సమాచారం ఉన్నప్పటికీ అధికార పార్టీ ఒత్తిళ్లతో ఏమీ చేయలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు తెలిసినా వాటిని ఉన్నతాధికారులకు చేరవేయడంలో విఫలమవుతున్నారనే విమర్శలున్నాయి. అసాంఘిక కార్యకలపాలపై దృష్టి పెట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.