ఆస్తులు అటాచ్‌మెంట్‌ చేసినందుకే వేణుగోపాల్‌రెడ్డి హత్య | - | Sakshi
Sakshi News home page

ఆస్తులు అటాచ్‌మెంట్‌ చేసినందుకే వేణుగోపాల్‌రెడ్డి హత్య

Sep 25 2025 7:35 AM | Updated on Sep 25 2025 7:37 AM

ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులో ఐదు రోజుల క్రితం జరిగిన ఫైనాన్షియర్‌ వేణుగోపాల్‌రెడ్డి హత్య కేసులో నింతులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మృతుడు తమ ఆస్తులను కోర్టులో అటాచ్‌మెంట్‌ చేశాడనే కోపంతో ఈ హత్య చేసినట్లు జిల్లా ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్‌ తెలిపారు. ప్రొద్దుటూరుకు చెందిన ఇరువురితో పాటు తెలంగాణా రాష్ట్రానికి చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం సాయంత్రం ప్రొద్దుటూరులోని ఎస్‌డీపీఓ కార్యాలయంలో డీఎస్పీ భావనతో కలసి జిల్లా ఎస్పీ అరెస్ట్‌ వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రొద్దుటూరులోని బొల్లవరం ప్లాట్లలో నివాసం ఉంటున్న కొండా వేణుగోపాల్‌రెడ్డి ఈ నెల 19న రాత్రి కిడ్నాప్‌నకు గురయ్యాడనే సమాచారం రావడంతో రూరల్‌ సీఐ నాగభూషణం, ఎస్‌ఐ అరుణ్‌రెడ్డి వేగంగా స్పందించారు. కిడ్నాప్‌ అయిన వ్యక్తిని ప్రాణాలతో కాపాడాలనే ఉద్దేశంతో డీఎస్పీ భావన ఆధ్వర్యంలో ఎస్‌ఐలు అరుణ్‌రెడ్డి, కేసీ రాజు, రాజుపాలెం ఎస్‌ఐ వెంకటరమణలతో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. ఈ కేసులోని అనుమానితులను గుర్తించి వారి ఫోన్‌ సిగ్నల్స్‌, గూగుల్‌ టెక్‌ అవుట్స్‌ ద్వారా నిందితులపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఈ క్రమంలోనే ఈ నెల 21న చాపాడు సమీపంలోని కుందూ వంతెన వద్ద వేణుగోపాల్‌రెడ్డి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా లక్ష్మిరెడ్డి, వెంకటసుబ్బారెడ్డిలు తెలంగాణా రాష్ట్రానికి చెందిన నలుగురు కిరాయి హంతకులతో వేణుగోపాల్‌రెడ్డిని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

ఆస్తుల అటాచ్‌మెంట్‌ ఆర్డర్‌ పొందడంతోనే..

మృతుడు వేణుగోపాల్‌రెడ్డి 30 ఏళ్లుగా వడ్డీ వ్యాపారం, రియల్‌ ఎస్టేట్‌ చేసేవాడు. ప్రొద్దుటూరులో చాలా మందికి వడ్డీకి అప్పులిచ్చాడు. సకాలంలో చెల్లించని వారిపై కోర్టులో సివిల్‌ దావాలు వేసి వసూలు చేసుకునేవాడు. డబ్బులు కట్టలేని వారి ఆస్తులు అటాచ్‌మెంట్‌ కోరేవాడు. ప్రొద్దుటూరుకు చెందిన వెన్నెపూస లక్ష్మిరెడ్డి, ఎడమకంటి వెంకటసుబ్బారెడ్డిలు కూడా వేణుగోపాల్‌రెడ్డి వద్ద పెద్ద మొత్తంలో వడ్డీకి తీసుకున్నారు. డబ్బు ఇవ్వడంలో ఆలస్యం కావడంతో అతను వారిద్దరి ఇళ్లపై అటాచ్‌మెంట్‌ ఆర్డర్‌ను కోర్టు ద్వారా పొందాడు. దీంతో కోపంతో రగిలిపోయిన వాళ్లిద్దరూ వేణుగోపాల్‌రెడ్డిపై కక్ష పెంచుకొని ఎలాగైనా అంతం చేయాలని నిర్ణయించుకున్నారు. కాగా 2016లో బాకీ డబ్బు విషయమై జరిగిన గొడవలో కొండా వేణుగోపాల్‌రెడ్డిపై లక్ష్మిరెడ్డి కట్టెతో దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటనపై త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో లక్ష్మిరెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదైంది.

హైదరాబాద్‌లో హత్యకు వ్యూహ రచన..

వెంకటసుబ్బారెడ్డి, లక్ష్మిరెడ్డిలు రియల్‌ ఎస్టేట్‌ చేస్తూ హైదరాబాద్‌లోని పఠాన్‌ చెరువు ప్రాంతంలో అపార్ట్‌మెంట్‌ నిర్మాణం చేపట్టారు. వారి వద్ద అసిస్టెంట్‌గా పని చేస్తున్న బోయిని నగేష్‌తో వేణుగోపాల్‌రెడ్డి హత్య గురించి చర్చించారు. అతను హత్య చేయడానికి అంగీకరించడంతో ఖర్చుల కోసం అతనికి పలు దఫాలుగా రూ. 70 వేలు ఇవ్వడంతో పాటు జీవనోపాధికోసం ఏదైనా వ్యాపారం పెట్టిస్తామని చెప్పారు. దీంతో నగేష్‌ తన మిత్రుల ద్వారా ఫైనాన్షియర్‌ను హత్య చేయడానికి ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో నలుగురు వ్యక్తులను హైదరాబాద్‌ నుంచి లక్ష్మిరెడ్డి, వెంకటసుబ్బారెడ్డిలు నాలుగు సార్లు ప్రొద్దుటూరుకు తీసుకొచ్చి వేణుగోపాల్‌రెడ్డిని చంపడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరకు ఈ నెల 19న వేణుగోపాల్‌రెడ్డిని చంపేసి మృతదేహాన్ని కామనూరు బ్రిడ్జిపై నుంచి కుందు నదిలో పడేశారు. దర్యాప్తులో భాగంగా కేసులోని నిందితులు ప్రొద్దుటూరుకు చెందిన వెన్నపూస లక్ష్మిరెడ్డి, ఎడమకంటి వెంకటసుబ్బారెడ్డి, తెలంగాణా రాష్ట్రంలోని మెదక్‌ జిల్లాకు చెందిన బోయిని నాగేష్‌ అలియాస్‌ హర్ష, లైని అజయ్‌కుమార్‌, హైదరాబాద్‌లోని రంగారెడ్డి జిల్లాకు చెందిన చింతలచెరువు ప్రణయ్‌ కుమార్‌, మియాపూర్‌కు చెందిన కొత్త శివప్రసాద్‌లను అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి మారుతి వేగనార్‌ కారు, హోండా యాక్టివా స్కూటీ, ఆరు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులోని నిందితుడు బోయిని నగేష్‌పై 2022లో మెదక్‌ జిల్లా అల్లదుర్గ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో హత్యాయత్నం కేసు నమోదైంది.

రూరల్‌ పోలీస్‌ బృందానికి ఎస్పీ ప్రశంస

వేణుగోపాల్‌రెడ్డి హత్య కేసును త్వరిత గతిన ఛేదించి నిందితులను అరెస్ట్‌ చేసిన ప్రొద్దుటూరు డీఎస్పీ, ప్రొద్దుటూరు రూరల్‌ పోలీసు బృందాన్ని ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్‌ అభినందించారు. బృందంలోని రూరల్‌ సీఐ నాగభూషణం, ఎస్‌ఐలు అరుణ్‌రెడ్డి, కేసీ రాజు, రాజుపాళెం ఎస్‌ఐ కె వెంకటరమణ, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఎవరైనా అధిక వడ్డీలకు డబ్బులిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఈ సందర్భంగా హెచ్చరించారు.

ఫైనాన్షియర్‌ హత్య కేసులో ఆరుగురు నిందితుల అరెస్టు

ప్రొద్దుటూరుకు చెందిన లక్ష్మిరెడ్డి,

వెంకటసుబ్బారెడ్డి సహా..

నలుగురు తెలంగాణా రాష్ట్రానికి

చెందిన కిరాయి హంతకులు

అరెస్టు వివరాలను వెల్లడించిన

జిల్లా ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement