
ఎయిడెడ్ పోస్టుల అక్రమాల సూత్రధారి ఆర్‌జేడీ శామ్యూల్
కడప సెవెన్‌రోడ్స్ : ఆర్‌సీఎం ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టుల్లో జరిగిన భారీ అక్రమాలకు ప్రధాన సూత్రధారి ఆర్‌జేడీ శామ్యూల్‌ను ప్రభుత్వం వెంటనే సరెండర్ చేసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, యువజన ప్రజా సంఘాల జేఏసీ బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించింది. జేఏసీ చైర్మన్ ఆర్‌ఎన్ రాజ, వైస్ చైర్మన్ అంకన్న తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై వెంటనే విచారణకు ఆదేశించాలని కోరారు. మూసివేసిన పాఠశాలల్లో సైతం ఉపాధ్యాయ పోస్టులు సృష్టించారని ఆరోపించారు. డిప్యూటీ డీఈఓ రాజగోపాల్‌రెడ్డి తన రాజకీయ బలంతో విధులకు హాజరు కాకుండా ఆర్‌సీఎం యాజమాన్యంతో కుమ్మక్కయ్యారన్నారు. జాయినింగ్ ఆర్డర్స్ తారుమారు చేసిన జాన్సన్ చెట్టురిపై క్రిమినల్ కేసులు నమోదుచేయాలన్నారు. అనంతరం జేసీ అదితిసింగ్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు జయవర్దన్, సుబ్బరాయుడు, శివకుమార్, డీఎం ఓబులేశు యాదవ్, కత్తి ఓబులేశు, సగిలి రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.