
రైతన్న గోడును పట్టించుకోని ప్రభుత్వం
పులివెందుల : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రైతన్నల గోడు పట్టించుకునే పరిస్థితిలో లేదని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన పులివెందులలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలను, ప్రజల బాగోగులను ఏమాత్రం పట్టించుకోరని ధ్వజమెత్తారు. ఆయన ఆలోచనంతా ప్రైవేట్ సంస్థలకు, వ్యక్తులకు పెద్ద పీట వేయడం గురించే ఉంటుందని ఆరోపించారు. తన అనుచరుల కు దోచిపెట్టేందుకే ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే కేంద్రం విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మాణం చేయడం జరిగిందన్నారు. కానీ అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఆ తీర్మాణానికి ఎందుకు మద్దతు తెలపలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని లక్ష కోట్ల మెడికల్ కళాశాలల ఆస్తిని చంద్రబాబు ప్రైవేట్‌పరం చేయడానికి పూనుకున్నాడన్నాని మండిపడ్డారు. ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్ పథకాలు అంటూ డబ్బా కొట్టుకుని అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయడం లేదన్నారు. మరోవైపు రైతన్నల పరిస్థితి అత్యంత దారుణంగా మారిందన్నారు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదన్నారు. మరోవైపు రైతులకు పండించుకోవడానికి ఎరువులు, యూరియాను సైతం ఈ ప్రభుత్వం అందజేయడంలేదన్నారు. రాష్ట్రంలో ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే ఎల్లో మీడియా ద్వారా ఏదో సాధించినట్లుగా దుష్ప్రచారం చేసుకోవడం విడ్డూరమన్నారు. అనంతరం ఎంపీ ప్రజా దర్బార్ నిర్వహించారు.