
రేషన్‌కార్డుదారులకు జీఎస్టీని మినహాయించాలి
ప్రొద్దుటూరు కల్చరల్ : కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ కొన్ని వస్తువులకే అమలవుతోందని అందువల్ల రేషన్‌కార్డు ఉన్నపేదలకు జీఎస్టీని మినహాయించాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ పేర్కొన్నారు. బుధవారం ఎన్జీఓ హోంలో ఏర్పాటు చేసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళా శక్తి పథకం వల్ల మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణిస్తుండటంతో ఆటో కార్మికులు తీవ్రంగా నష్ఠపోతున్నారన్నారు. వారిని ఆదుకోవడానికి ఆటో డ్రైవర్‌లకు రోజుకు 5 లీటర్ల ఇంధనాన్ని 50 శాతం సబ్సిడీతో అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలలోనే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ప్రభుత్వం చట్టభద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దానియల్ మాదిగ, రాష్ట్ర కార్యదర్శులు బాల లక్షుమయ్యమాదిగ, కర్ణమాదిగ, డప్పు చర్మకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం మాదిగ, కాకినాడ జిల్లా అధ్యక్షుడు శివమణి తదితరులు పాల్గొన్నారు.