●పేకాట క్లబ్‌లపై కట్టడి ఏదీ? | - | Sakshi
Sakshi News home page

●పేకాట క్లబ్‌లపై కట్టడి ఏదీ?

Sep 26 2025 6:26 AM | Updated on Sep 26 2025 6:26 AM

●పేకాట క్లబ్‌లపై కట్టడి ఏదీ?

●పేకాట క్లబ్‌లపై కట్టడి ఏదీ?

●పేకాట క్లబ్‌లపై కట్టడి ఏదీ?

సాక్షి ప్రతినిధి, కడప : జిల్లా పోలీసుశాఖ పనితీరుకు కూటమి నేతల మాటలు నిలువెత్తు అద్దంపడుతున్నాయి. వారి ఆరోపణల్లో వాస్తవాలు లేకపోలేదు. ప్రజాసమస్యల కంటే వ్యక్తిగత అజెండాకు కొంతమంది పోలీసు అధికారులు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం పరిపాటిగా మారింది. అసాంఘిక శక్తులపై ఖాకీల కరుకుతనం తగ్గిపోయింది. సివిల్‌ పంచాయతీలు, భూ తగాదా సెటిల్మెంట్‌లపై వారి మనసు మళ్లింది. ఉన్నతాధికారులు ప్రశ్నించినప్పుడు క్రికెట్‌ బెట్టింగ్‌, జూదం వ్యవహారాలపై నామ్‌కేవాస్తే తనిఖీలు నిర్వహించే పోలీసులు.. ప్రశ్నించే వారిపై ఎదురుదాడికి దిగుతూ చట్ట ప్రయోగాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక ఛాలెంజింగ్‌ కేసులు చేధించడంలో కూడా విఫలం చెందుతున్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ గండికోటలో మైనర్‌ బాలిక హత్య కేసే.

తొలుత హడావుడి.. ఆపై లేదు పురోగతి...

పర్యాటక ప్రాంతమైన గండికోటలో ఈ ఏడాది జూలై 14న బాలిక హత్య జరిగింది. స్నేహితుడి మోటార్‌ బైక్‌పై వెళ్లిన బాలిక తిరుగు ప్రయాణంలో లేదు. రాష్ట్రంలో సంచలనంగా మారిన బాలిక హత్య జరిగి 70రోజులు అవుతోన్నా ఇప్పటికీ కేసు తేల్చలేదు. ఎక్కడ వేసినా గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండిపోయింది. క్లూస్‌ టీమ్‌ పరిశీలించింది. డాగ్‌ స్క్వాడ్‌ పర్యటించింది. టవర్‌ లోకేషన్‌ తీశారు. ఫోన్‌ కాల్స్‌ టెక్నికల్‌ విశ్లేషణ చేశారు. ఇద్దరు ఐపీఎస్‌ స్థాయి అధికారుల పర్యవేక్షణలో క్షేత్రస్థాయిలో నలుగురు డీఎస్‌పీలు, నలుగురు సీఐలు, 10మంది ఎస్‌ఐలు దృష్టి పెట్టారు. అయిన్పటికీ కేసులో ఎలాంటి పురోగతి సాధించలేదు. హత్యలో స్నేహితుడు లోకేష్‌ ప్రమేయం లేదని, నిందితుల్ని సాయంత్రంలోగా అదుపులోకి తీసుకొని ఎస్పీ హత్య వివరాలు తెలియజేస్తారని స్వయానా డీఐజీ కోయ ప్రవీణ్‌ మీడియా ఎదుట ప్రకటించారు. రెండు నెలలు దాటినా సదరు హత్య కేసు కొలిక్కి రాలేదు. పోలీసుల వ్యవస్థకు సవాల్‌గా నిలిచిన ఈకేసులో పురోగతి లేకపోగా, అధికారుల పనితీరుపై సందేహాలు కలుగుతున్నాయి.

ఏకపక్ష చర్యలతో అభాసుపాలు

జిల్లాలో ఏకపక్ష చర్యలతో పోలీసుశాఖ అభాసుపాలవుతోంది. అందుకు పులివెందుల పోలీసుల ఏకపక్ష చర్యలను పరిశీలకులు ఉదాహరిస్తున్నారు. పులివెందులలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్సార్‌ కూడళ్లకు టీడీపీ మహానాడు సందర్భంగా ఆ పార్టీ జెండాలు, తోరణాలు కట్టారు. ఇది మంచి పద్ధతి కాదు, వైఎస్‌ విగ్రహాలకు ఉన్న టీడీపీ తోరణాలు తొలగించాలంటూ మున్సిపల్‌ కమిషనర్‌కు, పులివెందుల డీఎస్‌పీకి వైఎస్సార్‌సీపీ శ్రేణులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించి ఆయా సర్కిళ్లలో టీడీపీ జెండాలు తొలగించాలి. అలా చేయకపోవడంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కొంతమంది వైఎస్‌ విగ్రహాలకు ఉన్న టీడీపీ జెండాలు మాత్రమే తొలగించారు. అదే అదునుగా భావించి టీడీపీ నేత విజయ్‌కుమార్‌రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడినట్లు కేసు నమోదు చేశారు. పులివెందులలో క్రియాశీలకంగా ఉన్న వైఎస్సార్‌సీపీ నేతల్ని కేసులో చేర్చారు. అంతటితో ఆగకుండా ముగ్గురు మైనర్లను కూడా కేసులో చేర్చారు. ఇదే విషయమై బాధితులు హైకోర్టును ఆశ్రయించగా జెండాలు తొలగిస్తే హత్యాయత్నం కేసు ఎలా అవుతుందని హైకోర్టు సైతం ప్రశ్నించింది.

అసెంబ్లీ వేదికగా అధికార పార్టీ ఎమ్మెల్యే వరద ఆరోపణలు

జూదం, క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహారాల్లో అధికారుల పాత్ర

ఆరోపణలపై విచారణ చేయించాలని డిమాండ్‌

నాడు ఎంపీ రమేష్‌, నేడు ఎమ్మెల్యే వరద నోట జూదం మాట

పోలీసుశాఖలో అవినీతి అధికారులు కొనసాగుతున్నారు. డైరెక్టుగా డీఎస్పీలయినోళ్లు కూడా అవినీతికి పాల్పడుతున్నారు. సమస్యలపై వారికి చెప్పినా నిరుపయోగమే అవుతోంది. ప్రొద్దుటూరులో గుట్కా, మట్కా, క్రికెట్‌ బెట్టింగ్స్‌ నిర్వహిస్తున్నారు. ఆరోపణలు వచ్చినప్పుడు ఉన్నత అధికారి విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. కిందిస్థాయి అధికారులను కొంతమంది కాపాడుతున్నారు.

– ఈ నెల 25వ తేదీ.. అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి

జమ్మలమడుగు కేంద్రంగా విచ్చలవిడిగా పేకాట నిర్వహిస్తున్నారు. దేవగుడికి చెందిన వ్యక్తులు లక్షల్లో జూదం ఆడిస్తున్నారు. కుటుంబాలు సర్వనాశనం అవుతున్నాయి. జూదం క్లబ్‌లను కట్టడి చేయండి. వైఎస్సార్‌ జిల్లా ఎస్పీ, కలెక్టర్‌కు అభ్యర్థన.

– ఇటీవల బీజేపీ ఎంపీ

రమేష్‌నాయుడు బహిరంగ లేఖ.

జిల్లాలో ప్రొద్దుటూరు కేంద్రంగా క్రికెట్‌ బెట్టింగ్‌, మట్కా ఉన్నాయని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అసెంబ్లీ వేదికగా గళం విప్పారు. ఒక్క ప్రొద్దుటూరే కాదు జమ్మలమడుగు, పులివెందుల, కడప సబ్‌ డివిజన్లలోనూ అదే తంతు నడుస్తోంది. జమ్మలమడుగులో మరింత విస్తృతమైంది. కూటమి నేతల ప్రమేయంతో జూదంతోపాటు, మట్కా సైతం ఆడిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఒక స్టేషన్‌ పరిధిలో ప్రధాన బుకీలపై కేసులు నమోదు చేసిన పోలీసులు తర్వాత వారిని అరెస్ట్‌ చేయకుండా తాత్సారం చేశారు. ఈ కేసులో పోలీసులకు భారీగా ముడుపులు అందినట్లు ఆరోపణలు ఉన్నాయి. పేకాట అనధికారికంగా కొనసాగుతోంది. జిల్లా కేంద్రంలో నాలుగు క్లబ్‌లు ఉంటే యఽథేచ్ఛగా ఒక్క క్లబ్‌లో నిరంతరాయంగా పేకాట ఆడుతోన్నట్లు పలువురు చెప్పుకొస్తున్నారు. గండికోటలో పేకాట ఆడుతున్న వారిని జమ్మలమడుగు పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి లక్షల్లో నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు తెలిసే పేకాట కొనసాగుతున్నట్ల్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో కొంతమంది డబుల్‌ స్టార్‌, ట్రిపుల్‌ స్టార్‌ అధికారులు చట్టం, న్యాయం, ధర్మం పక్కకు తోసేసి ఖద్దరు నేతల మెప్పు కోసమే తాపత్రయం చూపుతున్నారు. ఇలాంటి పరిస్థితులను కట్టడి చేసి సరైన మార్గంలో వ్యవస్థను నడిపించాలని ఇటీవల ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ను ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement