
డిపోల అభివృద్ధిపై దృష్టి పెట్టాం !
● బస్టాండ్లలో మౌలిక వసతులను
మెరుగుపరుస్తాం
● పీటీడీ వైస్ చైర్మన్, ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు
మైదుకూరు/కడప కోటిరెడ్డిసర్కిల్: రాష్ట్రంలోని పీటీడీ( ఆర్టీసీ) డిపోలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టామని సంస్థ వైస్ చైర్మన్, ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన మైదుకూరు డిపోను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో డిపోలను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. గుడివాడ డిపోలో పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. గుత్తి డిపో అభివృద్ధిని కూడా చేపట్టామని తెలిపారు. పీటీడీ స్వయంగా చేయడం లేదా పీపీపీ ద్వారా చేసే ఆలోచనలో ఉన్నట్టు వివరించారు. ఆగస్టు 15న ప్రారంభించిన సీ్త్ర శక్తి పథకం రాష్ట్రంలో సజావుగా విజయవంతంగా సాగుతోందని తెలిపారు. బస్సుల్లో కొన్ని స్వల్ప సంఘటనలు జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. పీటీడీ బస్టాండ్లలో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఎండీ వెల్లడించారు. వర్షం వస్తే మోకాళ్ల లోతు నీటితో ఉండే బస్టాండ్లు ఉన్నాయని అలాంటి వాటిని బాగు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మూడు నెలల్లో పీటీడీకి 1,050 ఎలక్ట్రికల్ బస్సులు రానున్నట్టు ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. మైదుకూరు డిపో మేనేజర్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
ఇష్టంతో పనిచేయాలి
ప్రతి ఒక్కరూ ఇష్టంతో పనిచేయాలని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు సూచించారు. గురువారం సాయంత్రం జిల్లా పర్యటనకు వచ్చిన ఎండీ కడప ఆర్టీసీ గ్యారేజీని రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చెంగల్‌రెడ్డి (ఇంజనీరింగ్)తో కలిసి పరిశీలించి అధికారులకు పలు సూచనల చేశారు. కడప బస్టాండును ఆధునికీకరించేందుకు రూ.1.30 లక్షలు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభించి నాలుగు నెలల్లో సీసీ రోడ్లు పూర్తి చేస్తామన్నారు. ఆర్టీసీ ఆర్‌ఎం పొలిమేర గోపాల్‌రెడ్డి, డిప్యూటీ సీటీఎం డిల్లీశ్వరరావు, ఆర్టీసీ వీఅండ్‌ఎస్‌ఓ ధర్మతేజ, ఈఈ శ్రీనివాసులు, డీఈ పోతురాజు, యూనియన్ నాయకులు పురుషోత్తం, ఏఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను
ఆప్కాస్‌లో కలపాలి
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలోని వివిధ విభాగాల్లో 8వ వేల మంది ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్నారని, వారిని ఆప్కాస్‌లో కలపాలని ఆయా ఉద్యోగులు ఎండీ ద్వారక తిరుమలరావును విన్నవించారు.