
జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కల్పించాలి
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
కడప సెవెన్‌రోడ్స్ : జీఎస్టీ పన్నుల తగ్గింపుపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్‌లో అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 25 నుంచి అక్టోబర్ 19 వరకు ‘సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్’పై ప్రజల్లో అవగాహన, వివిధ రూపాల్లో ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఇందులో భాగంగా అవగాహన సమావేశాలు, పాఠశాలలు, కళాశాలల వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తత్వ పోటీలను నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ముందుగా జాయింట్ కమిషనర్ స్టేట్ టాక్సెస్ జి.సుమతి కొత్త జిఎస్టీ ప్రకారం వివిధ రంగాల వారీగా జిఎస్టీ వర్తింపు ఎలా జరుగుతుందనే వివరాలను క్లుప్తంగా వివరించారు. ఈ సమావేశంలో డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, జెడ్పీ సీఈఓ ఓబులమ్మ పాల్గొన్నారు.
గ్రామాల్లో సుస్థిర ఆదాయ మార్గాలు పెరగాలి
స్థానిక వనరులను సద్వినియోగం చేసుకుని గ్రామా ల్లో సుస్థిర ఆదాయ మార్గాలు పెరగాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి డ్వామా, ఉద్యాన, మండల అభివృద్ధి అధికారులను ఆదేశించారు. గురువారం శ్రీఎన్‌ఆర్‌ఈజీఎఎస్ పథకం ద్వారా నీటి భద్రత – గ్రామీణాభివృద్ధ్ఙి అనే అంశంపై కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రైతు సంక్షేమ శాఖా మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, కేంద్ర జలశక్తి అభియాన్ శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సంబందిత శాఖల కార్యదర్శులతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కడప కలెక్టరేట్‌లోని వీసీ హాలు నుంచి కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి హాజరయ్యారు. వీసీ ముగిసిన అనంతరం డ్వామా, ఉద్యాన, మండల అభివృద్ధి అధికారులు, అనుబంధ శాఖల అధికారులతో ఎన్‌ఆర్‌ఈజీఎస్ – జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో చేపడుతున్న, చేపట్టాల్సిన వివిధ రకాల పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం లోపు ఒక్క లక్ష ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగులోకి తేవాలని, అందులో భాగంగా ఈ ఏడాది చివరి నాటికి కనీసం 50 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగులోకి తీసుకువచ్చే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. డ్వామా పీడీ అదిశేషారెడ్డి, భూగర్భ గనుల శాఖ డీడీ మురళీధర్, ఇరిగేషన్ అధికారులు, అన్ని మండలాల ఎంపీడీఓలు, డ్వామా ఏపీడీలు, ఏపీఓలు పాల్గొన్నారు.
పర్యావరణ సహిత జిల్లా మనందరి బాధ్యత
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాను పర్యావరణ సహితంగా తీర్చిదిద్దే బాధ్యత మనందరి చేతుల్లో ఉందని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబందిత అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ‘బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్’పై కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలోని ఆసుపత్రులు, ఫ్యాక్టరీల సంఖ్య.. అవి ఉత్పత్తి చేసే వ్యర్థాలు, వాటి నిర్వహణ పనితీరు ఎలా జరుగుతుంది..? అన్న అంశాలపై సంబందిత అధికారులతో సమీక్షించారు.
విమానాశ్రయ అభివృద్ధికి చర్యలు
కడప విమానాశ్రయ అభివృద్ధికి అన్నిరకాల చర్యలు వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అన్ని రకాల భద్రతా ప్రమాణాలతో భవన నిర్మాణాలు చేపట్టాలన్నారు. కలెక్టరేట్‌లో ఎస్పీ సచికేత్ విశ్వనాథ్‌తో కలిసి ఎయిర్‌పోర్టు అభివృద్ది పనుల పురోగతిని సమీక్షించారు.సేఫ్టీ, సెక్యూరిటీకి సంబంధించిన పలు విష యాలను సంబంధిత అధికారులతో చర్చించారు. విమానాశ్రయం డైరెక్టర్, కమిటీ కన్వీనర్ సుజిత్ కుమార్ పొద్దర్,కమీషనర్ మనోజ్ రెడ్డి, ఆర్డీవో జాన్ ఇర్వీన్, ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ రమణ ఇతర అధికారులు పాల్గొన్నారు.