
ప్రజావ్యతిరేక విధానాలను అడ్డుకుంటాం
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
పులివెందుల : రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకుంటామని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక భాకరాపురంలోని తన స్వగృహంవద్ద ఆయన మాట్లాడారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యలను గాలికి వదిలేసిందన్నారు. కేవలం అధికారాన్ని అడ్డుపెట్టుకొని నియంతృత్వ పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. పవన్‌కళ్యాన్ ఓజీ సినిమాపై ఉన్న శ్రద్ధ రాష్ట్రంలోని ప్రజలపై ఈ ప్రభుత్వానికి లేకపోవడం దురదృష్టకరమన్నారు. చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌లు హైదరాబాద్ టు విజయవాడ తిరిగేందుకు వేలకోట్లు ప్రజాదనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమకేసులు పెట్టినా వైఎస్సార్ సీపీ నాయకులు కానీ.. ఏఒక్క కార్యకర్తగానీ భయపడే పరిస్థితి ఉండదన్నారు. తమ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినట్లు తమ పార్టీ వారిని ఆక్రమంగా వేధించిన వారిని ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తి ఉండదని స్పష్టం చేశారు. తెలుగుదేశం నాయకులు, అధికారులు.. పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అనంతరం ఆయన ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.