
జీవితాన్ని చదివేద్దాం.. బతికి సాధిద్దాం
● చదువులు, తరగతి గదులు, వసతి
గృహాల్లో ఇమడలేకపోతున్న విద్యార్థులు
● తల్లిదండ్రులూ ముందు జాగ్రత్తలు
తీసుకోండి
మన తాతలు, తల్లిదండ్రులు అక్షరం ముక్క చదవకపోయినా జీవించారు. రెక్కల కష్టంతోనే ఐదుగురి నుంచి పదిమంది పిల్లలను పెంచి పోషించారు. ఇప్పుడున్న వసతులు, సాంకేతికత, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అప్పుడు లేవు. ఇప్పుడున్న యువత చదువు అర్థం కాకపోయినా, ఫెయిలైనా, తమకు నచ్చని చదువులు, వివిధ కారణాలతో ఒత్తిడికి లోనై ప్రాణాలు తీసుకుంటున్నారు. క్షణికావేశంతో తల్లిదండ్రుల ఆశలను మధ్యలోనే తుంచి కన్నీళ్లు మిగులుస్తున్నారు. విద్యార్థులు జీవితాన్ని చదవాలి.. బతికి సాధించాలి.
వేంపల్లె : రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో ఆరేళ్ల సమీకృత ఇంటిగ్రేటెడ్ కోర్సును చదువుతున్న విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనై వసతి గృహాల్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత ఏడాది ఆగస్టు 8వ తేదీన ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన పీయూసీ–2 (ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం) చదువుతున్న జమీషా ఖురేషి అనే విద్యార్థిని క్యాంపస్‌లోని వసతి గృహంలో ఉన్న బాత్రూంలో తన చున్నీతో ఉరి వేసుకుని బలవన్మరణాకి పాల్పడింది. అలాగే చిత్తూరు జిల్లాకు చెందిన ఇంజినీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి శివ కిటికీ అద్దాలను పగులగొట్టి చేతులను గాయపరచుకున్నాడు. అనంతపురం జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని తోటి విద్యార్థితో ప్రేమలో పడి మూడంతస్తుల పై నుంచి దూకి మృతి చెందింది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఏచ్చర్ల మండలం షేర్ మహమ్మదాపురం గ్రామానికి చెందిన పీయూసీ–2 విద్యార్థి జి. నరసింహనాయుడు ఉరివేసుకుని మృతి చెందాడు. కళాశాలలో రాత్రి పూట చాలాసేపు మేలుకొని చదువుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని, తల్లిదండ్రులకు దూరంగా ఉన్నామని బెంగతో, హాస్టల్‌లో భోజనం సరిగా లేకపోవడంతో, తమకిష్టమైన చదువును చదవలేకనో, జీవితంపై విరక్తి చెంది ఈ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. జిల్లాలో ఇలాంటి సంఘటనలు నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి.
పిల్లలే తమ సర్వస్వమని..
పిల్లలే తమ సర్వస్వమని.. వారు ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. సంపాదనలో అధిక భాగం విద్య కోసమే ఖర్చు పెడుతుంటారు. ఇదే సమయంలో ఇతర కుటుంబాల పిల్లలతో పోలుస్తుంటారు. ఇది మంచిది కాదు. ఇలా చేయడం వల్ల వారిలో ఆత్మన్యూనత భావం పెరుగుతుంది. చదువు పేరుతో నిరంతరం ఒత్తిడికి గురి చేయరాదు. ఉద్యోగం, ఇంటి బాధ్యతలు ఉన్నా పిల్లలతో రోజుకు గంట అయినా ఆప్యాయంగా మాట్లాడాలి. అప్పుడే వారిలో మానసిక పరిపక్వత కలుగుతుంది. నలుగురిలో ధైర్యంగా మాట్లాడగలుగుతారు. ఏది మంచో, ఏది చెడో తెలుసుకుంటారు. సమాజంలో ఎలా జీవించాలో, నలుగురితో ఎలా నడుచుకోవాలో నేర్చుకుంటారు. ఏదైనా సమస్య వస్తే నేరుగా తల్లిదండ్రులతో చెప్పుకునేలా అవకాశం కల్పించాలని విద్యావేత్తలు, మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఒత్తిడి భరించలేకనే..
ప్రస్తుతం అన్ని రంగాల్లో తీవ్రమైన పోటీ నెలకొంది. దీంతో ప్రతి ఒక్కరూ కాలంతోపాటు పరుగులు తీయాల్సి వస్తోంది. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో ఈ ధోరణి ఎక్కువగానే ఉంది. మంచి మార్కులు, ర్యాంకులు వస్తేనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందనే భావనతో అందరూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పిల్లలపై ఒత్తిడి చేస్తున్నారు. ఇంట్లో ఉండి పిల్లలు తరగతి గదులు, తమకిష్టమైన చదువులను చదువుకోలేక, వసతి గృహాల్లో ఇమడలేక పోతున్నారు. అంతేకాకుండా ఫ్యామిలీ సమస్యలు, చిన్న, చిన్న సమస్యలకే తల్లడిల్లిపోతున్నారు. ఒక్కోసారి జీవితంపై విరక్తి చెంది కఠిన నిర్ణయాలు తీసుకుంటూ తల్లిదండ్రులకు శోకాన్ని మిగుల్చుతున్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు, మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.
పిల్లలకు భరోసా కల్పించాలి..
గ్రామీణ విద్యార్థులు ఎక్కువ శాతం తెలుగు మాధ్యమంలో చదువుకుంటున్నారు. ఇంటర్‌లోకి వచ్చేసరికి ఆంగ్ల మాధ్యమం ఎంచుకుంటున్నారు. భవిష్యత్‌లో తెలుగులో కంటే ఇంగ్లీష్ మాధ్యమం చదివిన వారికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అపోహతో ఇంగ్లీషు విద్యనభ్యసిస్తున్నారు. అంతేకాకుండా ట్రిపుల్ ఐటీలలో ఇంగ్లీష్ మాధ్యమంతోపాటు తెలుగు మీడియంలో కూడా బోధన చేస్తుంటారు. అయితే పరీక్షలు మాత్రం ఇంగ్లీష్ మాధ్యమంలోనే రాయాలి. కంప్యూటర్ తదితర వాటిపై మంచి పట్టు ఉండాలి. ఓరియంటల్ తరగతుల్లో మాత్రం మూడు నెలలపాటు శ్రద్ధగా చదివితే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇబ్బందులు ఉండవని ట్రిపుల్ ఐటీ అధికారులు భరోసా కల్పించాలి. ఒకేసారి భాషాపరమైన ఒత్తిడి, పోటీని తట్టుకుని నిలబడాలనే ఉద్దేశంతో శక్తికి మించి కష్టపడుతూ కుంగుబాటుకు లోనై ప్రాణాలు తీసుకుంటున్నారు. మొదటిసారి ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చిన పిల్లలను దృష్టిలో ఉంచుకుని వారికి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత కళాశాల యాజమాన్యాలపై ఉంది.
వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించాలి..
చదువులో వెనుకబడిన పిల్లలను ప్రోత్సహించాలి. మానసిక వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించాలి. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలి. ఉన్నత విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు జరిపి విద్యార్థుల సమస్యలు తెలుసుకుని భరోసా కల్పించాలి.

జీవితాన్ని చదివేద్దాం.. బతికి సాధిద్దాం