
కార్పెంటర్ ఆత్మహత్య
మదనపల్లె రూరల్ : అనారోగ్య పరిస్థితుల కారణంగా మనస్తాపం చెంది ఉరి వేసుకుని కార్పెంటర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మదనపల్లె మండలంలో మంగళవారం జరిగింది. పట్టణంలోని కోటవీధికి చెందిన నాగేంద్ర, శ్రీలత దంపతుల కుమారుడు టి.నాగరాజు(41) కార్పెంటర్‌గా పనిచేసేవాడు. అతనికి రామారావుకాలనీకి చెందిన వనితతో వివాహం కాగా ఇద్దరు సంతానం ఉన్నారు. మనస్పర్థల కారణంగా భార్య వనిత 17 సంవత్సరాల క్రితం భర్తను వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. పట్టణంలో కార్పెంటర్ పనులు చేస్తూ జీవిస్తున్న నాగరాజు ఏడాది క్రితం పనులు చేస్తుండగా ఉలి తగిలి కాలికి గాయమైంది. సరైన చికిత్స తీసుకోకపోవడం, పైగా షుగర్ వ్యాధి సమస్య ఉండటంతో ఇన్‌ఫెక్షన్ సోకి గాయం పుండుగా మారింది. ఈ క్రమంలో రెండు నెలలుగా తిరుపతిలో చికిత్స పొందాడు. అయినా ఫలితం లేకపోవడంతో అక్కడి డాక్టర్లు కాలు తొలగించాల్సి ఉంటుందని చెప్పారు. దీంతో ఇంటికి వచ్చిన నాగరాజు మనస్తాపం చెంది ఐదురోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. మంగళవారం మండలంలోని కొత్తపల్లె పంచాయతీ వడ్డిపల్లె సమీపంలోని ఎలుకకుంట వద్ద అల్లనేరేడు చెట్టుకు ఓ వ్యక్తి ఉరేసుకుని ఉండటాన్ని స్థానికులు గుర్తించి తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడిని ఉరి నుంచి కిందకు దించి అతని పక్కనే ఉన్న బ్యాగును పరిశీలించగా, అందులోని ఫోన్ నెంబర్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుని తల్లి శ్రీలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కళావెంకటరమణ తెలిపారు.