
బాలుడిని గదిలో ఉంచి.. తాళం వేసిన అంగన్‌వాడీ టీచర్
● స్పృహ తప్పిపడిపోయిన వైనం
● తల్లిదండ్రుల అప్రమత్తతతో
తప్పిన ప్రమాదం
బ్రహ్మంగారిమఠం : పిల్లలందరూ ఇంటికి వెళ్లారని భావించి ఓ బాలుడు లోపల ఉండగానే అంగన్‌వాడీ టీచర్ బడికి తాళం వేసుకుని వెళ్లింది. చిన్నారి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారుతో బడి తాళాలు పగులగొట్టి చూడగా బాలుడు లోపల స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. ఈ సంఘటన బ్రహ్మంగారిమఠం మండలంలోని గొడ్లవీడు పంచాయతీ పీసీపల్లె అంగన్‌వాడీ కేంద్రంలో జరిగింది. బాలుడి తండ్రి వెంకటసుబ్బయ్య కథనం మేరకు.. వీరి కుమారుడు బత్తల హరికృష్ణ(5)ను రోజులాగే మంగళవారం కూడా అంగన్‌వాడీ కేంద్రానికి పంపించారు. ఉదయం 11 గంటలకు అంగన్‌వాడీ కేంద్రం టీచర్ చంద్రకళ, ఆయాలు పిల్లలను ఇళ్లకు పంపించి కేంద్రానికి తాళం వేసుకుని వెళ్లారు. వ్యవసాయ పనులకు వెళ్లిన బాలుడి తల్లిదండ్రులు మధ్యాహ్నం 2.30 గంటలకు ఇంటికి వచ్చి చూడగా పెద్ద కుమారుడు మాత్రమే ఇంట్లో ఉన్నాడు. చిన్న పిల్లాడు కనిపించకపోవడంతో అన్నిచోట్లా వెతికారు. అనుమానంతో అంగన్‌వాడీ కేంద్రం సిబ్బందిని ప్రశ్నిస్తే తాము 11 గంటలకే అందరినీ ఇళ్లకు పంపించి వేశామని, తమకు తెలియదని చెప్పారు. కేంద్రం తాళాలు ఇవ్వండి లోపల ఏమైనా ఉన్నాడేమో చూస్తామని చెప్పినా వారు వినిపించుకోలేదు. దీంతో బాలుడి తల్లిదండ్రులు అంగన్‌వాడీ కేంద్రం తాళాలు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా బాలుడు ఏడ్చి ఏడ్చి భయంతో అపస్మాకర స్థితిలో పడిపోయి ఉన్నాడు. వెంటనే వారు బాలుడిని తీసుకుని ఇంటికి వెళ్లారు. అంగన్‌వాడీ సిబ్బంది నిర్వాకాన్ని ప్రశ్నిస్తే ఎవరికి చెప్పుకుంటారో.. చెప్పుకోపోండి.. మీపైనే కేసు పెడతాం అంటూ వారు బెదిరిస్తున్నారని బాలుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు.