
మొన్న కాలువ తీయించారు.. నిన్న పూడ్పించారు !
● రైతులతో అధికారుల చెలగాటం
● సాగునీటి సౌకర్యం కల్పించపోతే ఆత్మహత్యలే శరణ్యమంటున్న రైతులు
● గ్రీన్‌ఫీల్డుకు భూములిచ్చినా సాగునీరు లేకుండా చేస్తారా అని ఆవేదన
గత నెల 22న రెవెన్యూ ఆధికారుల ఆదేశాలతో
పోలీసుల సమక్షంలో తీయించిన పంట కాలువ
మంగళవారం రోడ్డు నిర్మాణ అధికారులు పోలీసుల సమక్షంలో
జేసీబీతో పంట కాలువ పైపులు తొలగిస్తున్న వైనం
చాపాడు : మండలంలోని సోమాపురం గ్రామం వద్ద గ్రీన్‌ఫీల్డు హైవే నిర్మాణంలో వెళ్లిన పంట కాలువ పైపులను మంగళవారం మధ్యాహ్నం రోడ్డు నిర్మాణ అధికారులు తీయించారు. సాగునీటిని అందించే పైపులు తొ లగిస్తే నాటుకున్న వరి పైర్లు ఎలా పండించుకోవాలని బాధిత రైతులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీ సులు రైతులను అడ్డుకున్నారు. బాధిత రైతులు తెలిపి న వివరాల మేరకు.. బెంగుళూరు – విజయవాడ గ్రీన్‌ఫీల్డు ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణంలో మండలంలోని సోమాపురం వద్ద గల సర్వే నెంబరు 28–4బి2లో 8 ఎకరాల వ్యవసాయ సాగు భూమికి పంట లేకుండా పోయింది. అయితే రైతుల అవసరం మేరకు రోడ్డు నిర్మాణంలో పంట కాలువ కోసం పైపులు నిర్మించినప్పటికీ ఇరువర్గాల మధ్య ఏర్పడిన ఆధిపత్య పోరులో పంట కాలువ సమస్యగా మారింది. ఈ క్రమంలో బాధిత రైతులైన అంకిరెడ్డిపల్లె రామచంద్రారెడ్డి, పెద్ద కొండారెడ్డి, చిన్న కొండారెడ్డి, భాస్కర్‌రెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డిలతో పాటు మరి కొంత మంది మహిళా రైతులకు చెందిన 8 ఎకరాల సాగుభూమికి సాగునీరు అందేలా పంట కాలువ ఏర్పాటు చేయాలని అధికారు లకు మొర పెట్టుకున్నారు. ఈ క్రమంలో గత నెలలో జమ్మలమడుగు ఆర్డీఓ, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇదే క్రమంలో గత నెల 19న రెవెన్యూ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా 22న రెవెన్యూ అధికారులు పోలీసుల సమక్షంలో పంట కాలువ తీయించారు. ఇదే పంట కాలువ విషయమైన 20న ఇరువర్గా ల వారు ఘర్షణ పడ్డారు. అయితే అప్పటి నుంచి అధికారులు తీయించిన పంట కాలువ ద్వారా బాధిత రై తులు వరి సాగు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 2న రోడ్డు నిర్మాణ అధికారులు పంట కాలువకు ఉండే పైపులను తొలగించారు. వీటిని తొలగిస్తే సాగునీరు ఎలా వస్తుందని, పంటలు ఎండిపోతాయని బాధిత రైతులు పనులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. భూములకు సాగు నీరు అందించే పంట కాలువ లేకుండా చేయడం ఏమిటని, దీనికి పోలీసులు సహకరిస్తే తాము పంటలు ఎలా పండించుకోవాలని బాధిత రైతులు వాపోయారు. వారం రోజుల క్రితం పంట కాలువ తీయించిన అధికారులు స్పందించి తమకు న్యాయం జరిగేలా పంట కాలువ తీయించాలని కోరుతున్నారు. లేకుంటే ఆత్మహత్యలే శరణ్యమని బాధిత రైతులు వాపోయారు.

మొన్న కాలువ తీయించారు.. నిన్న పూడ్పించారు !