
కూటమి పాలనలో రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేకుండా పోయిందని, కూలీ ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
సాక్షి, వైఎస్సార్: కూటమి పాలనలో రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేకుండా పోయిందని, కూలీ ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందుల పర్యటనలో ఉన్న ఆయనను మంగళవారం ఉదయం వేముల మండలం దుగ్గన్నగారి పల్లి వద్ద ఉల్లి, చీనీ బత్తాయి రైతులు కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు.
గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో తమను సర్కార్ ఆదుకున్నదని, నేడు ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల పంటలకు రేటు లభించక, అప్పుల పాలవుతున్నామంటూ రైతులు వాపోయారు. పొలంలోకి వెళ్లి ఉల్లి పంటను పరిశీలించిన అనంతరం రైతులకు జగన్ ధైర్యం చెప్పారు. ‘‘రైతులతో కూటమి సర్కార్ ఆడుకుంటోంది. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఇస్తామన్నారు. ఇప్పటివరకు ఇవ్వలేదు. అరటి రైతులు కూడా నష్టపోతున్నారు. ప్రభుత్వమే ఎరువుల బ్లాక్ మార్కెట్‌ను ప్రొత్సహిస్తోంది. కానీ,
మా హయాంలో ఏనాడూ ఎరువులు బ్లాక్‌లో అమ్మలేదు. ఇప్పుడు రైతులకు కూలీ ఖర్చు కూడా రావడం లేదు. ప్రభుత్వమే రైతుల వద్ద ఉల్లి కొనుగోలు చేయాలి’’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రైతులను పూర్తిగా గాలికి వదిలేశారు. ఈ రోజు చీనీ రేటు క్వింటా రూ.6 వేల నుంచి రూ.12 వేలకు అమ్ముడుపోతోంది. ఈ రేటుకు కూడా కొనుగోలు చేసే నాధుడు లేడు. దీనిలో కూడా పదికి రెండున్నర టన్నులు సూట్ కింద కమీషన్ వసూలు చేస్తున్నారు. ఇదే గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో మినిమమ్ క్వింటా రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు రేటుతో రైతులు అమ్ముకున్నారు. ఉల్లికి వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో మినిమమ్ రూ.4 నుంచి రూ.12 వేలు క్వింటాల్ అమ్ముడుపోయింది. నేడు రైతుకు క్వింటాకు గ్రేడ్ బాగుంటే రూ.600 నుంచి కనీసం రూ.800 లకు కొనుగోలు చేస్తున్నారు. గ్రేడ్ బాగలేకపోతే క్వింటా రూ.300 నుంచి కొనుగోలు చేస్తున్నారు. అంటే సగటున క్వింటా నాలుగైదు వందలకు కూడా రేటు రావడం లేదు.
ఉల్లి పండించిన రైతులకు కనీసం కూలి ఖర్చులు కూడా గిట్టుబాటు కావడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుల నుంచి కనీసం రూ.2500 చొప్పున ఉల్లి కొనుగోళ్ళు చేపట్టాలి. ప్రభుత్వమే ఈ పంటను బయటి రాష్ట్రాలకు కానీ, రైతుబజార్ల ద్వారా కానీ విక్రయించేలా చూడాలి. ఇదే ఉల్లిని హెరటేజ్‌లో కేజీ రూ.35 చొప్పున అమ్ముతున్నారు. ఇక్కడ రైతుకు ఇచ్చేది కేవలం రూ.6 మాత్రమే. ఇదే రైతుకు కేజీ రూ.25 చొప్పున చెల్లించి, చంద్రబాబు తమ లాభాలను కొద్దిగా తగ్గించుకున్నా కూడా రూ.35 కి అమ్ముకోవచ్చు కదా? హెరిటేజ్‌లో లాభాలు తగ్గకూడదు, చంద్రబాబు వ్యాపారాలు జరగాలి, ఇదీ ప్రభుత్వ పరిస్థితి. అరటి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కనీసం రూ.3వేలకు కూడా కోసే వారు కనిపించడం లేదు. గత వైయస్ఆర్‌సీపీ హయాంలో రూ.25 వేల నుంచి రూ.30వేలకు రైతులు అమ్ముకున్నారు.
యూరియా కూడా అందించలేకపోతున్నారు
వైయస్ఆర్‌సీపీ హయాంలో యూరియా ఎప్పుడూ బ్లాక్‌లో అమ్ముకునే పరిస్థితి లేదని.. ఆర్బీకే వ్యవస్థ ద్వారా ప్రతి రైతుకు తన గ్రామంలోనే యూరియా లభించేలా చర్యలు తీసుకున్నామని.. తద్వారా కమీషన్లు, బ్లాక్ లో అమ్ముకోవడం అనే ప్రసక్తే లేకుండా చేశామని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ‘ఈ రోజు యూరియాకు కమీషన్లు తీసుకుని బ్లాక్‌లో రైతులకు విక్రయిస్తున్నారు. కనీసం రెండు వందల రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారు. లేదంటే తమ వద్ద ఉన్న పురుగుమందులు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. మా హయాంలో రూ.265 రూపాయలకు యూరియా బ్యాగ్ లభించేది. తమ గ్రామంలోనే యూరియాను కొనుగోలు చేసేవారు. సొసైటీలు, ఆర్బీకేలు రైతుకలు అందుబాటులో ఉండి పనిచేశాయి. నేడు సొసైటీలు, ఆర్బీకేలు లేవు. వీరి ద్వారా సరఫరా చేస్తే ప్రభుత్వంలోని పెద్దలకు కమీషన్లు రావని, బ్లాక్ మార్కెట్‌ను దగ్గరుండి మరీ ప్రోత్సహిస్తున్నారు.
ఉల్లి, చీని, అరటి, మినుము ఇలా ఏ పంటచూసినా రేటు లేని స్థితిలో రైతులు వ్యవసాయం చేస్తున్నారు. రైతుకు పెట్టుబడి సాయం చూస్తే, చంద్రబాబు అన్నదాత సుఖీభవ కింద రెండేళ్ళకు ఇరవై వేల చొప్పున రూ.40 వేలు ఇవ్వాల్సి వున్నా ఇంత వరకు ఇచ్చింది కేవలం రూ.5 వేలు మాత్రమే. గతంలో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఇచ్చిన ఉచిత పంటల బీమాను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా ఎగ్గొట్టేసింది. ప్రభుత్వ పెద్దలే దగ్గరుండి బ్లాక్ మార్కెటింగ్‌ను ప్రోత్సహిస్తున్నారు. ఆర్బీకేలు, పీఎస్‌సీఏలకు ఎందుకు యూరియా కోటా ఇవ్వడం లేదు’’ అని జగన్ మండిపడ్డారు.
