గొర్రెల్లో నీలి నాలుక వ్యాధి | - | Sakshi
Sakshi News home page

గొర్రెల్లో నీలి నాలుక వ్యాధి

Aug 5 2025 6:26 AM | Updated on Aug 5 2025 6:26 AM

గొర్ర

గొర్రెల్లో నీలి నాలుక వ్యాధి

కడప అగ్రికల్చర్‌ : జిల్లాలో రుతుపవనాల ఆగమనంతోపాటు ఉపరితల ఆవర్తణంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని వర్షాలు ప్రారంభమయ్యాయి. గొర్రెలు, మేకల యజమానులు మారిన వాతావరణంతో పాటు అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలతో అప్రమతంగా ఉండాల్సిన అవసరం ఉంది. జిల్లా వ్యాప్తంగా 433588 గొర్రెలు, 176123 మేకలు ఉన్నాయి. ఈ వర్షాల రాకతో గొర్రెలు, మేకలకు నీలి నాలుక వ్యాధి సొకుతుంది. ఈ వ్యాధిని ఆయా ప్రాంతాలను బట్టి మూతివాపు వ్యాఽధి, నోటి పుండ్ల వ్యాధి వంటి పేర్లతో కూడా పిలుస్తుంటారు. ఈ వ్యాధి మందలో ఒకేసారి గొర్రెలకు సోకే అవకాశం ఉంది. వ్యాధి సోకిన గొర్రెలు మృత్యువాత పడే పరిస్థితులు కూడా ఎక్కువగా ఉంటాయి. కనుక గొర్రెలు, మేకల కాపర్లు, యజమానులు ఈ వర్షాకాలంలో గొర్రెల పెంపకంలో అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలో ఇప్పటికే చాలా మండలాల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నట్లు పలువురు గొర్రెలు, మేకల యజమానులు తెలిపారు.

వ్యాధి వ్యాప్తి ఇలా..

గొర్రెలకు ఈ వ్యాధి వైరస్‌ ద్వారా సోకుతుంది. ఈ వైరస్‌ మాధ్యమిక అతిదేయి దోమ(క్యూలికాయిడ్స్‌) జాతికి చెందిన కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. మందలో ఒక గొర్రెకు ఈ వ్యాధి వస్తే ఒక గొర్రె నుంచి మరో గొర్రెకి వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా జులై, ఆగస్టు, సెప్టెంబర్‌, డిసెంబర్‌ నెలల్లో ఈ వ్యాధి ప్రబలుతుంది.

వ్యాధి లక్షణాలు ఇలా..

● గొర్రెలలోకి వైరస్‌ ప్రవేశించిన వారం రోజుల్లో దాని ప్రభావం కనిపిస్తుంది

● 105 నుంచి 106 డిగ్రీల జ్వరం వచ్చి ఐదు రోజుల పైబడి ఉంటుంది

● జ్వరం వచ్చిన 48 గంటల తర్వాత నోటి నుంచి చొంగ కారడం, నోరు మొత్తం ఎర్రగా మారడం, చొంగ కూడా నురుగలా మారి పెదవులు, చిగుళ్లు, పై దవడ, నాలుక వాచిపోవడం, నాలుక ఇరువైపులా పుండ్లు ఏర్పడి బాగా ఉబ్బి నీలిరంగుకు మారుతుంది.

● గొర్రెలకు రక్తపు జీరలు కనిపించడం, ముక్కు లోపల భాగం నుంచి చీము రావడం, చీముతోపాటు రక్తం రావడం చేస్తుంది. ఆ తరువాత ముక్కులో జిగురు ఎండిపోవడంతో శ్వాస తీసుకోలేని పరిస్థితి ఏర్పడి గొర్రెలు, మేకలు చనిపోయే అవకాశం ఉంటుంది, ఈ వ్యాధి గొర్రెలకు, మేకలకు సోకినప్పుడు వాటిల్లో గర్భస్రావం కూడా అయ్యే అవకాశం ఉంటుంది

● వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న గొర్రెలలో వ్యాధి కాళ్లకు కూడా పాకుతుంది. గిట్టల మొదటి భాగం ఎర్రగా కందిపోయి వాచి చీముపట్టి నడవలేక కుంటుతాయి

● ఈ రోగం కారణంగా మేత తినలేకపోవడం వలన జీవాలు నీరసించి బరువు కోల్పోయి మృత్యువాత పడతాయి

● వ్యాధి చివరి దశలో నాలుక నీలిరంగుకు మారుతుంది. నోటి నుంచి దుర్వాసన వస్తుంది.

● ఈ వ్యాధి మేకలకు అరుదుగా సోకుతుంది.

వ్యాధి నివారణ ఇలా..

● జబ్బు చేసిన వాటిని మందలోని ఆరోగ్యవంతమైన జీవాల నుంచి వేరు చేయాలి. తర్వాత వేరు చేసిన వాటికి చికిత్స చేయాలి.

● పొటాషియం పర్మాంగనేట్‌ ఒక శాతం ద్రావంతో నోటిలో పుండు కలిగి శుభ్రమైన పొడిగుడ్డతో తుడిచి బోరో గ్లిసరిన్‌ ఆయింట్‌మెంట్‌ రాయాలి. లేదా టాపిక్యుర్‌ ఓరల్‌ స్ప్రే కూడా వాడవచ్చు

● పశువైద్య డాక్టర్‌ను సంప్రదించి పెన్సిలిన్‌, ఓరల్‌ ఎన్రోప్లాక్సోసిస్‌ వంటి యాంటిబయాటిక్‌లను, జ్వరం రాకుండా మెలోనెక్ష ప్లస్‌ మందులు నోటి ద్వారా గాని, ఇంజక్షన్‌ రూపంలో ఐదు నుంచి ఏడు రోజుల పాటు ఇవ్వాలి.

● గొర్రెలు నీరసంగా ఉంటే గ్లూకోస్‌, ఎలక్ట్రాల్‌ పౌడర్‌ను నీటిలో కలిపి తాగించాలి. వ్యాధి నుంచి కోలుకున్నాక సైలెనులు ఎక్కించడం, లివర్‌టానిక్‌, బలానికి విటమినులు కలిగిన టానిక్‌లు, ఖనిజ లవణాలు అందించాలి

వాతావరణ మార్పులతో గొర్రెలు, మేకలకు వ్యాప్తి

అప్రమత్తం అవసరం అంటున్న పశువైద్యులు

అల్లోపతి, ఆయుర్వేదిక్‌, హోమియో

చికిత్సలతో నివారణ

ఆయుర్వేదిక్‌ చికిత్స కూడా..

ఈ వ్యాధి సోకిన గొర్రెలు, మేకలకు నేరేడు చెక్క 100 గ్రాములు, తులసి ఆకులు 50 గ్రాములు, నేలవేము ఆకులు 50 గ్రాములు నూరి ముద్ద చేసి రోజుకు ఒక సారి 3 రోజులు ఇవ్వాలి.

150 గ్రాముల వావిల ఆకులు, 100 గ్రాములు వేపాకు ఒక లీటరు నీటిలో అర లీటరు ఆయ్యే వరకు మరిగించి ఆ అర లీటరు నీటిని రోజుకు రెండు సార్లు చొప్పున 3 రోజులు ఇస్తే తగ్గిపోతుంది.

హామియో చికిత్స ఇలా..

వ్యాధి సోకిన వాటికి ఉదయం ఎకినేసియ 200, మెర్క్‌ సాల్‌ 200, ఆసియం 200 మందులు తీసుకుని 5 చుక్కలు లేదా 5 మాత్రలు, 5 ఎంఎల్‌ వైవిరాల్‌ అనే విటమిన్లు ద్రావణంలో కలిపి ఇవ్వాలి.

మధ్యాహ్నం..

రుస్‌ టాక్స్‌ 200లను 5 చుక్కలు లేదా 5 మాత్రలు వేయాలి.

సాయంత్రం..

పల్సటిల్ల 200లను 5 చుక్కలు లేదా 5 మాత్రలను వేయాలి. లేదంటే జెమ్‌ ఫార్మ వారి బూటి – డీఎస్‌ఓ అనే మందును వాడాలి.

గొర్రెల్లో నీలి నాలుక వ్యాధి1
1/1

గొర్రెల్లో నీలి నాలుక వ్యాధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement