
మృత్యు కుహరంగా పెన్నా నది
జమ్మలమడుగు : పెన్నానది మృత్యుకుహరంగా మారుతోంది. పెన్నానదిలో నీరు ఉండటంతో ఈత కోసం, స్నానాల కోసం దిగి లోతు తెలుసుకోలేక గుంతల్లో పడి మరణిస్తున్నారు. పెన్నానదిలో ఇష్టారాజ్యంగా ఇసుక అక్రమ రవాణా చేయడంతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ప్రతి ఏడాది పెన్నానది లోకి తాగునీటి అవసరాల కోసం మైలవరం జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో గుంతలన్నీ పూడిపోయి ఎక్కడ ఏమి ఉందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది జూన్ మొదటి వారంలో తెలంగాణ ప్రాంతం హైదరాబాద్‌కు చెందిన మనోహర్ అతని కుమారుడు ఇయోల్ సోదరి ఇంటికి వచ్చి పెన్నానదిలో భార్య కళ్లెదుటే భర్త, కుమారుడు నీటిలో మునిగి మరణించారు. ఇది మరచిపోకముందే ఆగస్టు 1వతేదీ చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా బారికేడ్ల నిర్మాణం కోసం కడప నుంచి కూలీలు జమ్మలమడుగుకు వచ్చారు. పనులు పూర్తయిన తర్వాత స్నానం చేయడం కోసం పెన్నానదిలోకి షేక్ మున్నా, గోపాల్‌లు దిగారు. అయితే లోతును సరిగా గుర్తించలేక పోయి నీటిలో మునిగారు. అదే సమయంలో పెన్నానదిలో దుస్తులు ఉతికేందుకు వచ్చిన రజకులు పరుగున వచ్చి వారిని బయటకి లాగే ప్రయత్నంలో భాగంగా చీరె వేసినా వారు అందుకోలేకపోయారు. దీంతో ఇరువురు గల్లంతయ్యారు. గాలింపు చర్యలు చేపట్టి షేక్ మున్నా మృతదేహాన్ని బయటికి తీశారు. ఆయితే గోపాల్ మృతదేహాం రెండు రోజుల తర్వాత లభించింది. పెన్నానదిలో కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే పది మందికిపైగా మునిగి చనిపోయారు. పెన్నానది సమీపంలో హెచ్చరిక బోర్డులు పెట్టినా స్నానం చేసేందుకు చాలా మంది నీళ్లలోకి దిగుతున్నారు. ప్రస్తుతం పెన్నానది లోనికి మైలవరం జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. నీటి గుంతలు అన్నీ మునిగిపోయి ఉన్నాయి. ఎవరు గుంతల్లో దిగినా గల్లంతయ్యే ప్రమాదం ఉంది. అధికారులు పెన్నానదిలోకి ఎవరూ దిగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
రెండేళ్ల వ్యవధిలోనే పది మందికిపైగా
మృత్యువాత