
సాక్షి, పులివెందుల: పులివెందులలో ఎన్నిక నిర్వహిస్తున్నది ఎన్నికల సంఘమా? లేక ప్రభుత్వమా? అని ప్రశ్నించారు వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తాము ఓడిపోతామనే టీడీపీ అసహనానికి గురైంది. ఉప ఎన్నిక సజావుగా జరగకుండా చూడాలని కుట్ర చేస్తోంది. జిల్లా మొత్తం నుంచి టీడీపీ కార్యకర్తలు పులివెందులలో దిగారని ఆరోపించారు.
వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చి మోసం చేసింది. సూపర్ సిక్స్, సెవెన్ పేరుతో ప్రజలకు నిండా ముంచారు. ఉప ఎన్నికల్లో గెలివలేరని కూటమికి అర్థమైంది. అందుకే కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారు. ఇండిపెండెంట్లు, వైఎస్సార్‌సీపీ కార్యకర్త పెళ్లికి వెళ్తే దాడి చేశారు. వాళ్లపై కేసులు నమోదైనా.. మరోసారి దాడికి యత్నించారు. ఉప ఎన్నిక సజావుగా జరగకుండా చూడాలని కూటమి కుట్ర చేస్తోంది. జిల్లా మొత్తం నుంచి టీడీపీ కార్యకర్తలు పులివెందులలో దిగారు. వైఎస్సార్‌సీపీ నాయకులను కావాలనే బైండోవర్ చేస్తున్నారు.
ఎన్నిక నిర్వహిస్తున్నది ఎన్నికల సంఘమా? లేక ప్రభుత్వమా?. పులివెందుల ప్రజలు ఎంతో తెలివైన వాళ్లు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిని గెలిపిస్తారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కార్యకర్తలు సంయమనం పాటించాలి. పోలీసులు బెదిరించి మరీ పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు. నల్లపురెడ్డిపల్లికి చెందిన భాస్కర్ రెడ్డిపై కేసులు లేకపోయినా బైండోవర్ అంటూ స్టేషన్‌కు తరలించారు. ఎన్నిక జరిగే పులివెందుల మండలానికి సంబంధం లేని లింగాల రామలింగారెడ్డిపై కేసులు లేకపోయినా బైండోవర్ నమోదు చేశారు. ఇలా ఈ రెండు రోజుల్లోనే 100 మందికి పైగా వైఎస్సార్సీపీ నాయకులను బైండోవర్ చేశారు అని ఆరోపించారు.