
సాక్షి, వైఎస్సార్: పులివెందుల ఉప ఎన్నికల నేపథ్యంలో టీడీపీ మూకలు రెచ్చిపోతున్నారు. తాజాగా పులివెందుల మండలం నల్లగొండువారిపల్లిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వైఎస్సార్‌సీపీ నాయకుడు వేల్పుల రాముపై పచ్చ మూకల దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో వారికి గాయాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
వివరాల ప్రకారం.. నల్లగొండువారిపల్లిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, రాముపై టీడీపీ గూండాలు దాడి చేశారు. పచ్చ గూండాల దాడిలో రమేష్ యాదవ్‌కు గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులను కలవడానికి వెళ్తున్న రాముపై టీడీపీ మూకలు విచక్షణా రహితంగా దాడికి దిగారు. ఈ సందర్బంగా నాలుగు వాహనాలను పూర్తిగా ధ్వంసం చేశారు.
తీవ్రంగా గాయపడిన వేల్పుల రామును.. పోలీసులు తమ వాహనంలోనే పులివెందుల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాముకు ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. ఈ ఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి.. ఆసుపత్రికి వెళ్లి రామును పరామర్శించారు. ఆసుపత్రి వద్దకు భారీగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు చేరుకుంటున్నారు.
టీడీపీ గూండాల దాడుల కారణంగా గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. తమ గ్రామంలో ఎప్పుడు లేని విధంగా టీడీపీ దాడులకు దిగడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామాల్లోకి ఎవరు రావద్దు.. తామే ఓట్లు వేస్తామని చెబుతున్నారు. అయిన్పటికీ తమ ఇళ్లపై టీడీపీ మూకలు పెట్రోల్ పోసి భయపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
