సాక్షి ప్రతినిధి, కడప: ఓ చిన్న ఉప ఎన్నిక.. అదీ పది వేల ఓట్ల ఎన్నిక.. ఎటువంటి బలం లేకపోయినా.. ఎలాగోలా అధికారాన్ని అడ్డుపెట్టుకుని గెలవాలని, అడ్డదారులు ఎంచుకుంది కూటమి సర్కార్. పులివెందులలో ప్రజాబలం కంటే పోలీసు బలాన్నే నమ్ముకొని ఎన్నికలు నడిపిస్తున్నారు. వైఎస్సార్సీపీలో కీలకంగా ఉన్న నేతలను టార్గెట్ చేస్తూ వేధింపులు ప్రారంభించారు. ఇప్పటికే పలు గ్రామాల్లో వైఎస్సార్‌సీపీలో కీలకంగా ఉన్న నాయకులపై బైండోవర్ కేసులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
స్థానికంగా బలం లేకపోయినా..
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోటీకి దిగిన టీడీపీ అభ్యర్థి, బీటెక్ రవి సతీమణి మారెడ్డి లత పులివెందుల మండలమే కాదు. స్థానిక బలం లేకపోయినా అధికారం ఉంది కదా అని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్‌రెడ్డిపై పోటీకి దిగారు. ఇక ప్రజా బలం లేదు కాబట్టి ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలిచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడ్డాలో గెలిచాం అని చెప్పుకోవాలనే తాపత్రయం.. పులివెందుల నుంచి అమరావతి వరకూ టీడీపీ ప్రధాన నేతల్లో ఉంది. ఆపై అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. మొన్నటికి మొన్న సోమవారం అసలు పులివెందులలోనే లేని వ్యక్తులపై తప్పుడు ఫిర్యాదు చేయించారు. వైఎస్సార్‌సీపీ తరఫున ఉన్న వైస్ ఎంపీపీ విశ్వనాథ్‌రెడ్డిని లోబర్చుకుని తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. స్థానికంగా అందుబాటులో లేని, హైదరాబాద్‌కు పరిమితమైన వైఎస్ భాస్కరరెడ్డి, దేవిరెడ్డి శంకర్‌రెడ్డిపై కేసు నమోదు చేయించారు. ఈ ఫిర్యాదులో పేర్కొనని వ్యక్తులను కూడా అందులో చేర్చేందుకు రంగం సిద్ధం చేశారు. నల్లపురెడ్డిపల్లెకు చెందిన అచ్చుకట్ల భాస్కరరెడ్డి లాంటి వారిని కూడా కేసులో చేర్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇలా మాట వినని, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయానికి కృషి చేసే నాయకులపై వేధింపులు ముమ్మరం చేస్తున్నారు.
వేములలో వేల్పుల రామలింగారెడ్డిపై బైండోవర్
పులివెందుల సబ్ డివిజన్ పరిధిలో అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలోని వైఎస్సార్‌సీపీ నేతలపై బైండోవర్ కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. మంగళవారం వైఎస్సార్‌సీపీ నేత వేల్పుల రామలింగారెడ్డిపై వేముల పోలీసులు బైండోవర్ కేసు నమోదు చేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు నిర్వహిస్తే వేముల, వేంపల్లె, తొండూరు, సింహాద్రిపురం, లింగాల, చక్రాయపేట పోలీసు స్టేషన్‌లలో కూడా అక్కడి నేతలపై బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్త రీత్యా అనుకున్నా.. ఇరుపక్షాల నాయకులపై బైండోవర్ కేసులు నమోదు చేయాలి. ఇప్పటి వరకూ ఒక్క టీడీపీ నాయకుడిపై కూడా బైండోవర్ కేసు నమోదు కాలేదు. పులివెందులతోపాటు పక్క మండలాలల్లో కూడా వైఎస్సార్‌సీపీ నేతల్ని బైండోవర్ చేస్తుండటం గమనార్హం. ఒక్క పులివెందుల మండలంలో ఇప్పటికే సుమారు 80 మందిని బైండోవర్ చేసినట్లు సమాచారం. టీడీపీ నుంచి ఒక్కరంటే ఒక్కర్ని కూడా బైండోవర్ చేయకపోవడం విశేషం.
ఎలాంటి కేసులు లేకపోయినా...
జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని, అలా కుదరకపోతే కనీసం వైఎస్సార్‌సీపీ మెజార్టీని అయినా తగ్గించాలని టీడీపీ, బీజేపీ నేతలు జట్టుకట్టి మరీ పావులు కదుపుతున్నారు. ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయడం కంటే.. వైఎస్సార్‌సీపీ వారిని టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. మంగళవారం ఉదయం నుంచి పల్లెల్లో వైఎస్సార్‌సీపీ నాయకులపై బైండోవర్ కేసులు ప్రారంభించారు. ఎన్నిక రోజు కీలక నాయకులను బయటకు రాకుండా చేయాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు అసలు పోలీసు రికార్డుల్లోనే ఎటువంటి కేసూ లేని వ్యక్తులను కూడా స్టేషన్లకు పిలిచి వేధింపులకు దిగుతున్నారు. అలాంటి వారిపై కూడా అన్యాయంగా బైండోవర్ కేసులు పెడుతున్నారు. బైండోవర్ కేసులు నమోదు అయిన వ్యక్తులు పోలింగ్ ఏజెంట్లుగా కూర్చునేందుకు అభ్యంతరం పెట్టడమే ప్రధాన లక్ష్యంగా కన్పిస్తోంది. ‘మీరెన్ని కేసులు పెట్టినా, ఎంత మందిని బైండోవర్ చేసినా ప్రజాబలంతో విజయదుందుభి మోగిస్తాం’ అని వైఎస్సార్‌సీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లి, ప్రజలను మెప్పించి, ఒప్పించడానికి చేతకాక.. ఇలాంటి అక్రమ మార్గాలను ఎంచుకుని విజయం సాధించాలని టీడీపీ పావులు కదుపుతోంది. మరో వైపు వైఎస్సార్‌సీపీ ప్రజల్లోకి దూసుకెళుతూ ప్రజలకు తాము చేసిన సేవలను వివరిస్తూ ముందుకు వెళ్తున్నారు. వెరసిప్రజలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి పూర్తి మద్దతు తెలుపుతుండటం విశేషం.
వైఎస్సార్‌సీపీ కీలక నేతలు బైండోవర్
బీటెక్ రవి ఒత్తిడికితలొగ్గుతున్న పోలీసులు
విశ్వనాథరెడ్డి ఫిర్యాదు మేరకు మరికొందర్ని లాగేందుకు సన్నాహాలు
వ్యవస్థలను ముందుపెట్టి పబ్బం గడుపుకునే పనిలో పడ్డ టీడీపీ
ఖాకీకి ‘పసుపు’ మరక అంటుకుంటోంది. అధికార పార్టీ నాయకులకు