
నులి పురుగుల నివారణకు చర్యలు
కడప సెవెన్‌రోడ్స్ : పిల్లల్లో నులి పురుగులు నిర్మూలించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ అధికారులను ఆదేశించారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినం సందర్భంగా సోమవారం తన చాంబర్‌లో నిర్వహించిన జిల్లా టాస్క్‌ఫోర్స్ సమావేశంలో ఆమె మాట్లాడారు. 1 నుంచి 2 సంవత్సరాలలోపు పిల్లలకు 200 మిల్లీ గ్రాములు, 3 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలకు 400 మిల్లీ గ్రాములు చొప్పున అల్బేండజోల్ మాత్రలు ఇవ్వాలన్నారు. పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం తర్వాత వీటిని మింగించాలన్నారు. పాఠశాలకు వెళ్లని పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లో మింగించాలన్నారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పిల్లలు గోర్లు కత్తిరించుకోవడం, భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత చేతులు సబ్బుతో కడుక్కోవడం, కాళ్లకు చెప్పులు ధరించడం, మరుగుదొడ్లను వినియోగించడం వంటి అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. 1–19 ఏళ్ల పిల్లలకు ఈనెల 12, 20 తేదీలలో నులి పురుగుల నివారణ మందు మింగించాలన్నారు. తొలుత ఆమె ఇతర అధికారులతో కలిసి జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో డీఈఓ షంషుద్దీన్, ఐసీడీఎస్ పీడీ, జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.