
యూరియా సహా ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచాలి
కడప సెవెన్‌రోడ్స్ : యూరియా సహా అన్ని రకాల ఎరువులను తక్షణమే రైతులకు అందుబాటులో ఉంచాలని వైఎస్సార్‌సీపీ నాయకులు సోమవారం డీఆర్‌ఓ విశ్వేశ్వరనాయుడుకు వినతిపత్రాన్ని సమర్పించారు. రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, జెడ్పీ ఉపాధ్యక్షుడు బాలయ్య మాట్లాడుతూ అధికారులతో అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి గ్రామ స్థాయి వరకు ఎరువుల పంపిణీపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో నిల్వలు పెంచి అక్కడే రైతులకు అందజేయాలని కోరారు. బ్లాక్ మార్కెట్‌కు తరలించే వ్యాపారుల లైసెన్సులు తక్షణమే రద్దు చేయడంతోపాటు కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎరువుల నిల్వలపై వ్యవసాయశాఖ ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో కడప వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు జీఎన్ భాస్కర్‌రెడ్డి, చెన్నూరు ఎంపీపీ చీర్ల సురేష్‌యాదవ్, రైతు విభాగం కడప నగర అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, చెన్నూరు వైస్ ఎంపీపీ చిన్నా, రాచిన్నాయపల్లె సర్పంచ్ నారాయణరెడ్డి పాల్గొన్నారు.
పోలీసుల అదుపులో నిందితుడు
నందలూరు : నందలూరు పోలీసు స్టేషన్‌లో క్రైమ్ నెంబర్ 15/2022 కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న తిరుపతి పట్టణం కరకంబేడు వీధికి చెందిన చంద్ర రమేష్ అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను స్టోర్ బియ్యం విక్రయం కేసులో నిందితుడిగా ఉండి, కోర్టు వాయిదాలకు హాజరుకానందున కోర్టు అతనిపై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. నిందితుడిని సోమవారం నందలూరు కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించిందన్నారు.