
ఉపాధి కరువు
కడప సెవెన్‌రోడ్స్ : పీ4 (పబ్లిక్, ప్రైవేటు, పీపుల్స్ పార్టనర్‌షిప్).. ముఖ్యమంత్రి మొదలు కిందిస్థాయి అధికారుల వరకు నిత్యం జపిస్తున్న మాట. నిరుపేదలను గుర్తించి దాతల సహకారంతో వారి పేదరికాన్ని పోగొట్టడమే పీ4 కార్యక్రమ లక్ష్యంగా ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. నిజానికిది ఓ మాయా పథకం. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీటి ప్రాజెక్టులు .. ఇలా మౌలిక సమస్యలను గాలికి వదిలేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు పీ4 పేరిట ప్రజలను తప్పుదారి పట్టించే యత్నాలకు పాల్పడుతున్నారని మేధావులు విమర్శిస్తున్నారు. స్ట్రక్చరల్ ఎకనమిక్ పాలసీల్లో మార్పు రాకుండా దాతృత్వంతో పేదరికం ఎలా రూపుమాపగలుగుతారని ప్రశ్నిస్తున్నారు. ఇది అధికార టీడీపీ పొలిటికల్ ప్రాజెక్టు తప్ప మరొకటి కాదని స్పష్టం చేస్తున్నారు.
దాతల సహకారంతో నిరుపేదలను దారిద్య్రం నుంచి వెలికి తీసుకురావడమే పీ4 కార్యక్రమ ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది. పేదలను బంగారు కుటుంబాలని, దాతలకు మార్గదర్శకులనే ట్యాగ్ తగిలించారు. జిల్లాలో ప్రాథమికంగా 78 వేల బంగారు కుటుంబాలు ఉన్నాయని అధికారులు సర్వేలో గుర్తించారు. గ్రామ, వార్డు సభలు నిర్వహించి ఆగస్టు 10 నాటికి తుది జాబితా రూపొందించనున్నారు. దాతల సహకారంతో వారి అవసరాలు తీర్చడం ద్వారా అభివృద్ధి పథంలోకి తీసుకువస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇందుకోసం ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయదు. పేదలు–దాతలకు ఒక వేదిక సమకూర్చడం తప్ప ఇందులో ప్రభుత్వ పాత్ర ఏమి ఉండదు. సాయం మీరు చేయండి....రాజకీయంగా పేరు మేము తెచ్చుకుంటామన్నది అధికార టీడీపీ ఉద్దేశ్యంగా కనబడుతోందని మేధావుల అభిప్రాయం. కేవలం దాతృత్వం వల్ల పేదరికం పోతుందనుకుంటే పొరపాటేనని చెబుతున్నారు. జిల్లాలో ఎన్నో దశాబ్దాలుగా ఛారిటబుల్ ట్రస్టులు, స్వచ్ఛంద సంస్థలు ఎన్నో విలువైన సేవలు అందిస్తూనే ఉన్నా పేదరికం ఎందుకు పోలేదని ప్రశ్నిస్తున్నారు. మౌలిక సమస్యల నుంచి.. ఇచ్చిన హామీల నుంచి ప్రజలను పక్కదారి పట్టించే ఉద్దేశ్యం తప్ప ఇది మరొకటి కాదని అంటున్నారు.
నీతి అయోగ్, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే–5 నివేదికల మేరకు వివరాలిలా ఉన్నాయి.
విద్య, వైద్యం, ఉపాధి వంటి ప్రధాన రంగాలను ఏమాత్రం పట్టించుకోకుండా దాతృత్వం ద్వారా పేదరికాన్ని పోగొడతామని చెప్పడం పూర్తిగా హాస్యాస్పదం. జిల్లా జనాభా 20.61 లక్షలు ఉండగా జననాలలో లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది మగ శిశువులకు 779 మంది మాత్రమే ఆడ శిశువులు జన్మిస్తున్నారు. ప్రతి లక్ష లైవ్ బర్త్‌లకు 157 మాతృ మరణాలు సంభవిస్తున్నట్లు కడప జీజీహెచ్ సర్వే ద్వారా తెలుస్తోంది. ఇక ప్రతి 1000 లైవ్ బర్త్‌లకు 38 చొప్పున శిశు మరణాలు సంభవిస్తున్నాయని అధికారిక నివేదికల ప్రకారం తెలుస్తోంది.
జిల్లాలో పీడిస్తున్న ప్రధాన సమస్యల్లో రక్తహీనత ఒకటి. పోషకాహార లోపమే ఈ సమస్యకు కారణం. జిల్లాలోని 13 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 11,662 మంది గర్భిణులను గుర్తించగా, అందులో 1568 మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. నాన్ ప్రెగ్నెంట్ మహిళల్లో 56.1 శాతం మంది ఎనీమియాతో బాధపడుతున్నారు. ఇక 15–19 ఏళ్లలోపు మహిళల్లో 60.2 శాతం రక్తహీనత ఉంది. 6 నుంచి 59 నెలల వయస్సుగల పిల్లల్లో 60.6 శాతం రక్తహీనత ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. రక్షిత తాగునీరు, పారిశుధ్యం, వ్యాక్సినేషన్, క్లీన్ ఫ్యూయల్, గృహాలు, విద్యుత్, తదితర అనేక అంశాలు ప్రజలను పట్టిపీడిస్తున్నాయి.
జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో రిజిష్టర్ అయిన పిల్లలు 1,05,499 మంది ఉన్నారు. 0 నుంచి 5 ఏళ్లలోపు పిల్లల్లో తీవ్ర పోషకాహార లోపంతో (ఎస్‌ఏఎం) బాధపడుతున్న వారు 1331 మంది, ఎంఏఎం పిల్లలు 4056 మంది ఉన్నారు. వయస్సుతగ్గట్టు ఎత్తు లేని (సివియర్ స్టంటెడ్) పిల్లల సంఖ్య 8024, మోడరేట్ 15,280 మంది ఉన్నారు. తీవ్ర బరువు తక్కువ పిల్లలు 1377, మోడరేట్ 7115 మంది ఉన్నారు.
పేదరికం కారణంగా జిల్లాలో బాల్య వివాహాలు పెద్ద ఎత్తునే జరుగుతున్నాయి. 2012 నుంచి 2025 మధ్యలో 545 బాల్య వివాహాలను అడ్డుకున్నామని ఐసీడీఎస్ అధికారుల నివేదికలు పేర్కొంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంఖ్య 399 ఉండగా, అర్బన్ ప్రాంతాల్లో 146 ఉన్నట్లు నివేదిక వెల్లడిస్తోంది. పీసీఎంఏ చట్టం కింద రిజిష్టర్ అయిన కేసులు మాత్రం 29 మాత్రమే. అధికారుల నివేదికల కంటే వాస్తవంగా జరుగుతున్న బాల్య వివాహాల సంఖ్య అధికంగానే ఉంది.
జిల్లాలో అక్షరాస్యత శాతం 61.76గా ఉంది. ప్రీ ప్రైమరీ పాఠశాలలకు వెళుతున్న ఐదేళ్లలోపు పిల్లల శాతం 9.5 గా నమోదైంది. ఆరేళ్ల పైబడిన బాలికలు పాఠశాలలకు వెళుతున్నవారి శాతం 61.9గా ఉంది. పదేళ్లు, ఆపై వయస్సుగల బాలికలు 49 శాతం మాత్రమే పాఠశాలలకు వెళుతున్నారు. మొత్తంగా మహిళల అక్షరాస్యత శాతం 63.8గా నమోదైంది.
జిల్లాలో ఉపాధి లేక అనేక మంది సాంకేతిక, ఉన్నత విద్య అభ్యసించిన మీదట పొరుగు రాష్ట్రాలకు వలసలు వెళుతున్నారు. విభజన హామీల్లోని కడప స్టీల్ ప్లాంటు నిర్మాణం ఇప్పటికీ శంకుస్థాపనకే పరిమితమైంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటైంది. జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో అల్ డిక్సన్, ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు వచ్చాయి. గోపవరం ప్రాంతంలో సెంచురీ ఫ్లైవుడ్ పరిశ్రమ వంటివి మినహాయిస్తే చంద్రబాబునాయుడు గత పాలనలోనూ, ఇప్పుడు ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదు. పైగా కొప్పర్తిలోని ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్ కమ్ టెస్టింగ్ ఫెసిలిటీని అమరావతికి తరలించారు.
జిల్లాలో వ్యవసాయోగ్యమైన భూమి 3,05,954 హెక్టార్లు ఉంది. కాగా భూమి లేని నిరుపేదలు జిల్లాలో లక్షల్లో ఉన్నారు. ఇక ఎకరాలోపు భూమి ఉన్న పేదలు 1,89,804 మంది, ఎకరా నుంచి రెండుఎకరాల వరకు ఉన్న రైతుల సంఖ్య 95,797 మంది, 4 నుంచి 10 ఎకరాలు ఉన్నరైతుల సంఖ్య 52,726 మంది, పెద్ద రైతులు 474 మంది ఉన్నారు. వ్యవసాయం ప్రధానంగా వర్షాధారంపై ఆధారపడే నేటికీ కొనసాగుతోంది. కేసీ
కెనాల్ మినహాయిస్తే దశాబ్దాల క్రితం ప్రారంభించిన తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా లాంటి ప్రాజెక్టులు నేటికీ పూర్తి కాలేదు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు చూస్తుంటే వందేళ్లకై నా ప్రాజెక్టులు పూర్తి కావని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఇలా జిల్లా ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం
అరకొరగా అందుతోంది. యువతకు ఉపాధి బరువైంది. శిక్షణ నైపుణ్యాలు దొరకడమే గగనమైంది. ప్రభుత్వ కార్యాలయాల్లో విచ్చలవిడి అవినీతి జరుగుతోంది. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది. రేషన్ కార్డు మొదలు ఆధార్ కార్డు దాకా.. చిన్న మార్పులు చేయాలన్నా పైసలివ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇవేవీ పట్టించుకోకుండా.. సరైన మౌళిక వసతులు కల్పించకుండా పీ4 పేరుతో మభ్యపెట్టడంపై పలువురు విమర్శిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేని బాబు.. ఇప్పుడు పీఫోర్ పల్లవి ఎత్తుకున్నారని రాజకీయపరిశీలకులు తూర్పారబడుతున్నారు.
పిల్లల్లో పోషకాహార లోపం
బాల్య వివాహాలు
అక్షరాస్యత
ప్రధాన రంగాలను విస్మరిస్తూ...
పీడిస్తున్న రక్తహీనత
‘పీ4’.. ఓ బూటకం.. బాబు నాటకం!
దాతల సహకారంతో పేదరికం పోతుందా?
ప్రజలను పక్కదారి పట్టించే ఎత్తుగడ
ఇది టీడీపీ పొలిటికల్ ప్రాజెక్టు ...
మేథావుల విమర్శలు

ఉపాధి కరువు

ఉపాధి కరువు

ఉపాధి కరువు

ఉపాధి కరువు

ఉపాధి కరువు