సేవా తత్పరుడు.. జింకా సుబ్బరాయుడు | - | Sakshi
Sakshi News home page

సేవా తత్పరుడు.. జింకా సుబ్బరాయుడు

Apr 30 2025 2:00 AM | Updated on Apr 30 2025 2:02 AM

కడప ఎడ్యుకేషన్‌ : ఆయన ప్రభుత్వం నుంచి తనకు లభించే జీతాన్ని తన అవసరాల మేరకు వినియోగించుకుని మిగిలిన మొత్తాన్ని విద్యార్థుల విద్యాభివృద్ధికి వినియోగిస్తూ వచ్చారు. ఆయన పనిచేిసిన కళాశాలలకే కాకుండా ఇతర కళాశాలలకు చెందిన పిల్లల విద్యాభివృద్ధికి అవసరమైన పలు రకాల వస్తువులను వితరణగా ఇచ్చి దాతృత్వానికి చిరునామాగా నిలిచా రు. ఇలా రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలకు దాదాపు రూ. 50 లక్షల మేర సాయం అందించారు. ఆయనే ప్రభుత్వ పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ జింకా సుబ్బరాయుడు. నేడు ఉద్యోగ విరమణ చేయనున్న సందర్భంగా ఆయన దాతృత్వాన్ని తెలిపే కథనం..

ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన జింకా సుబ్బరాయుడు 1992లో నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ (ఈసీఈ) లెక్చరర్‌గా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. నంద్యాల కళాశాల పిల్లల చదువుకోసం పలు మార్లు దాదాపు రూ. 25 లక్షలు విలువ చేసే పలు రకాల వస్తువులను వితరణగా ఇచ్చారు. అలాగే ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలకు రూ. 1.5 లక్షల విలువతో పలు రకాల వస్తువులు ఇచ్చారు. జమ్మలమడుగు పాలిటెక్నిక్‌ కళాశాలకు రూ. 2 లక్షలు, తాడిపత్రి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలకు రూ. 2 లక్షలు, కమలాపురం పాలిటెక్నిక్‌ కళాశాలకు రూ.1.24 లక్షలు, కావలి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలకు రూ. 3 లక్షలు, ఆలూరు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలకు రూ. 3 లక్షలు, పెనుదుర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలకు రూ. 3 లక్షలు, ఓబులవారిపల్లి పాలిటెక్నిక్‌ కళాశాలకు రూ.లక్ష, కర్నూలు ప్రభుత్వ కళాశాలకు రూ. 4 లక్షల మేర ఆర్థిక చేయూతను వస్తువుల రూపంలో అందించారు.

కడప ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలకు కూడా...

కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ (హెచ్‌ఓడీ)గా పనిచేస్తున్న దామోదరానికి జింకా సుబ్బరాయుడు గురు వు. దీంతో తమ కళాశాలకు కూడా ఏదైనా సాయం చేయాలని హెచ్‌ఓడీతో పాటు ప్రిన్సిపల్‌ జ్యోతి అడగటంతో దాదాపు రూ. 6.50 లక్షలు విలువ చేసే పలు రకాల వస్తువులను వితరణగా ఇచ్చారు. ఇందులో రూ. 2 లక్షలు విలువ చేసే ఆర్‌ఓ ప్లాంట్‌, రెండు వాటర్‌ కూలర్లు, బాలికల హాస్టల్‌కు రూ. 1.22 లక్షలు విలువ చేసే వీధిలైట్లు, ఇన్వేటర్‌ను, రూ. 2.60 లక్షలు విలువ చేసే ల్యాబ్‌ ఎక్యూప్‌మెంట్‌, అలాగే ప్రింటర్‌, ల్యాబ్‌లకు సేఫ్టీ డోర్స్‌ ఇలా అన్ని కలిపి దాదాపు రూ.6.5 లక్షలు విలువ చేసే పలు రకాల వస్తువులను వితరణగా ఇచ్చి దాతృత్వాన్ని చాటుకున్నారు.

ప్రస్తుతం ఆదోని కళాశాలలో ..

జింకా సుబ్బరాయుడు ప్రస్తుతం ఆదోని పాలిటెక్నిక్‌ కళాశాలలో పని చేస్తున్నారు. ఈయన ఈ కళాశాలకు కూడా రూ. 10 లక్షల విలువ చేసే విద్యాభివృద్ధికి సంబంధించిన వస్తువులను వితరణగా ఇచ్చారు. ఇవే కాకుండా శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో అన్నదానం కోసం రూ. 8 లక్షలు, ఓంకారం ఆలయానికి రూ. 1.25 లక్షలను వితరణగా ఇచ్చారు.

300 మందికి చదువులు..

జింకా సుబ్బరాయుడు సతీమణి జింకా జ్యోతి కూడా ఉపాధ్యాయురాలు. ఈమె కూడా పేద పిల్లల చదువుకు తన వంతు సాయం అందిస్తున్నారు. ఇప్పటి వరకు 300 మంది విద్యార్థులను చదివించారు.

విద్యార్థుల ఉన్నతికి ఆర్థిక చేయూత

అందించడమే ఆయన లక్ష్యం

పలు కళాశాలకు రూ. 50 లక్షల వస్తువుల వితరణ

నేడు ఉద్యోగ విరమణ

నేడు ఉద్యోగ విరమణ..

ఆదోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఈసీఈ లెక్చరర్‌గా పనిచేస్తున్న జింకా సుబ్బరాయుడు బుధవారం ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయనను మీరు పనిచేసిన కళాశాలలకు ఇన్ని లక్షలు ఎందుకు ఖర్చు చేశారని ప్రశ్నిస్తే డిపార్టుమెంట్‌ నాకు ఎంతో ఇచ్చింది.. నేను పనిచేసే కళాశాల పిల్లలకు ఎంతో కొంత ఇవ్వాలనే దృక్పథంతోనే నా వంతు సాయాన్ని చేస్తూ వచ్చాను. నేను చేసిన ఆ సహాయం నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది అంటూ సమాధానమిచ్చారు.

సేవా తత్పరుడు.. జింకా సుబ్బరాయుడు1
1/2

సేవా తత్పరుడు.. జింకా సుబ్బరాయుడు

సేవా తత్పరుడు.. జింకా సుబ్బరాయుడు2
2/2

సేవా తత్పరుడు.. జింకా సుబ్బరాయుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement