
తహాసీల్దార్ సుభానీ
చాపాడు : చాపాడు మండల తహసీల్దార్ విధులు నిర్వహిస్తున్న జేఎస్ సుభానీని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ సోమవారం జిల్లా కలెక్టర్ విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. మండల పరిధిలోని కుచ్చుపాప రెవెన్యూ పొలం పరిధిలోని సర్వే నంబర్ 33/1, 2లో 1.56 ఎకరాలు, సర్వే నంబర్ 34/4లో 0.81 ఎకరాలు, 34/5లో 0.82 ఎకరాల ప్రభుత్వ అసైన్‌మెంట్ భూమి నరహరిపురం గ్రామానికి చెందిన నందిమండలం జయరామిరెడ్డి పేరుతో ఉంది.
పైన పేర్కొన్న సర్వే నంబర్లలోని 3.19 ఎకరాల భూమిని ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీన ఎలాంటి ఆధారాలు లేకుండా చింతకుంట చిన్న పుల్లారెడ్డి అనే వ్యక్తి వెబ్ ల్యాండ్‌లో మార్పు చేశారు. దీనిపై వచ్చిన ఫిర్యాదు మేరకు చేపట్టినవిచారణలో తహాసీల్దారు సుభానీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించటంతో జిల్లా కలెక్టర్ వేటు వేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు చేశారు. ఈయన స్థానంలో ఇక్కడ డిప్యూటీ తహసీల్దారుగా ఉన్న యామినిని ఇన్‌చార్జి తహసీల్దారుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.