
సాక్షి,వైఎస్సార్ జిల్లా: ఏపీలో కోవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి. నమోదవుతున్న కోవిడ్-19 కేసులతో కూటమి నేతల్లో టెన్షన్ మొదలైంది. అందుకే కోవిడ్-19 కేసుల్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా, వైఎస్సార్ జిల్లాలో కరోనా కేసు నమోదైంది. ఆ కేసును దాచిపెట్టేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
వైఎస్సార్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు నమోదుపై కడప డీహెచ్‌ఎంవో నాగరాజు స్పందించారు. కడప జిల్లాలో ఎక్కడా కరోనా కేసులు నమోదు కాలేదు. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న చాగలమర్రి మహిళకు కోవిడ్ లేదు. ఆమెకు కొంత ఊపిరితిత్తుల సమస్య మాత్రమే ఉంది’ అని అన్నారు.
కానీ రిమ్స్‌లో చికిత్స పొందుతున్న మహిళకు కరోనా సోకినట్లు రిమ్స్ సూపరింటెండెంట్ రమాదేవి తెలిపారు. బాధిత మహిళకు వైద్యం చేస్తున్న అధికారులు కరోనా పాజిటివ్ అంటుంటే డీఎంహెచ్‌ఓ కాదని చెప్పడంతో అధికారుల తీరుపై అనేక అనుమానాలు నెలకొన్నాయి.
ఎందుకంటే? ఈ నెల (మే) 27 నుంచి కడపలో టీడీపీ మహానాడు నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ క్రమంలో కోవిడ్ కేసులు నమోదు కావడంతో పచ్చ నేతల్లో ఆందోళన మొదలైంది. కోవిడ్ అంటే మహానాడుకు ఎవరూ రారనే భయంతో కేసులే నమోదు కాలేదని వైద్యాదికారులతో చెప్పిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బాధిత మహిళకు చికిత్స చేస్తున్న రిమ్స్ సూపరింటెండెంట్ కోవిడ్ నిర్దారణ అయిందని స్పష్టం చేయడం.. జిల్లా వైద్యాధికారి కోవిడ్ లేదని చెప్పడమే అందుకు నిదర్శనమంటూ ప్రజలు కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్నారు.