
పిచ్చికుక్క దాడిలో ఒకరికి గాయాలు
పులివెందుల రూరల్ : పట్టణంలోని ముద్దనూరు రోడ్డులోని బస్టాండు సమీపంలో పిచ్కికుక్క స్వైర విహారం చేసింది. గత మూడు రోజులుగా ప్రయాణికులపై దాడి చేస్తూ ఆందోళనకు గురి చేస్తోంది. శుక్రవారం కొత్త బస్టాండ్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్న ప్రశాంతిపై పిచ్చి కుక్క దాడి చేయడంతో గాయాలయ్యాయి. అంతటితో ఊరుకోకుండా ప్రయాణికులపైకి దూసుకెళ్లి అరవడంతో భయపడిపోయారు. అధికారులకు ఈ విషయం చెప్పినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారేగానీ చర్యలు తీసుకోవడంలేదు. కుక్కను పట్టి తరలించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
పదో తరగతి విద్యార్థిని అదృశ్యం
గుర్రంకొండ : పదో తరగతి విద్యార్థిని అదృశ్యమైన సంఘటన మండలంలోని మర్రిమాకులపల్లెలో జరిగింది. గ్రామానికి చెందిన వెంకటేశ్, సుమలతల కుమార్తె వర్షిత(16) స్థానిక తెలుగు జెడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి చదివింది. పది పరీక్ష ఫెయిల్ కావడంతో గుర్రంకొండ తెలుగు జెడ్పీ హైస్కూల్‌లో గురువారం సప్లమెంటరీ పరీక్ష రాసేందుకు వచ్చింది. రాసిన అనంతరం ఇంటికి చేరుకోకపోవడంతో తల్లిదండ్రులు గుర్రంకొండకు చేరుకొని వాకబు చేశారు. రెండు రోజులుగా విద్యార్థిని ఆచూకీ కోసం గాలించినా కనపడకపోవడంతో ఆమె తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రఘరామ్ తెలిపారు.
370 లీటర్ల సారా ఊట ధ్వంసం
మదనపల్లె రూరల్ : బి.కొత్తకోట మండలంలో దాడులు జరిపి 370 లీటర్ల సారా ఊట ధ్వంసం చేసినట్లు సీఐ భీమలింగ తెలిపారు. విలేకరులతో శుక్రవారం ఆయన మాట్లాడుతూ బి.కొత్తకోట మండలం సుబ్బిరెడ్డిగారిపల్లెలో ఎకై ్సజ్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారని తెలిపారు. జి.కృష్ణప్ప కుమారుడు జి.రవికుమార్(30), టి.సుబ్బయ్య కుమారుడు టి.ఆనంద్(34), అదే గ్రామానికి చెందిన కె.వెంకటరమణ(70)లు సారా విక్రయిస్తుండగా ఆరెస్టు చేశామన్నారు. వారి వద్ద పది లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీంతోపాటు తయారీకి సిద్ధంగా ఉంచిన 370 లీటర్ల సారా ఊటను ధ్వంసం చేశామన్నారు. ముగ్గురు వ్యక్తులపై వేర్వేరుగా కేసులు నమోదుచేసి రిమాండ్‌కు పంపామన్నారు. ఈ దాడుల్లో ఎకై ్సజ్ ఎస్‌ఐ జబీవుల్లా, డార్కస్, కానిస్టేబుళ్లు మధుసూధన్, వెంకటేష్, నాగరాజు, మధు పాల్గొన్నారు.
మహిళకు తీవ్రగాయాలు
మదనపల్లె రూరల్ : గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ గాయపడిన సంఘటన శుక్రవారం మండలంలో జరిగింది. గుర్తుతెలియని మహిళ(60) బసినికొండ, కొండామర్రిపల్లెలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. ఎప్పటిలాగే భిక్షాటనకు వెళుతుండగా.. కొండామర్రిపల్లె రోడ్డు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడగా, స్థానికులు బసినికొండ మహిళా పోలీస్‌కు సమాచారం అందించారు. స్థానికుల సహాయంతో మహిళా పోలీస్ బాధితురాలిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

పిచ్చికుక్క దాడిలో ఒకరికి గాయాలు

పిచ్చికుక్క దాడిలో ఒకరికి గాయాలు