
గోపవరం : మండలంలోని కాలువపల్లె పంచాయతీ లక్కవారిపల్లె ఎస్సీ కాలనీకి చెందిన బల్లిరవిశంకర్ అనే యువకుడు బర్రెల కోసం అటవీ ప్రాంతానికి వెళ్లి తిరిగి రాకపోవడంతో సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రవిశంకర్‌కు సంబంధించిన బర్రెలు కనిపించకపోవడంతో తన అక్క, బావతో కలిసి వెతుకులాడేందుకు గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతానికి ఆదివారం వెళ్లాడు. సాయంత్రానికి అక్క, బావ తిరిగి ఇంటికి రాగా.. రవిశంకర్ మాత్రం ఇంటికి చేరుకోలేదు.
దీంతో సోమవారం కుటుంబ సభ్యులు బద్వేలు రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అటవీశాఖ సిబ్బంది, పోలీసులు గానుగపెంట బీట్‌లో ముమ్మరంగా గాలించారు. ఆచూకీ కోసం డ్రోన్ కెమెరాను కూడా ఉపయోగించారు. రూరల్ సీఐ సుదర్శన్‌ప్రసాద్, ఎస్‌ఐ చంద్రశేఖర్ అటవీ ప్రాంతంలో తిరిగుతూ ఆచూకీ కోసం ప్రయత్నించారు. రవిశంకర్ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కూడా పోలీసులకు సహకరిస్తూ అటవీ ప్రాంతంలో తిరుగుతున్నారు.
సోమవారం రాత్రి వరకు కూడా యువకుడి ఆచూకీ దొరకలేదని పోలీసులు సమాచారమిచ్చారు. కాగా అదృశ్యమైన రవిశంకర్‌కు మూడు నెలల క్రితమే వివాహమైంది. బర్రెల కోసం వెళ్లి రెండు రోజులుగా తిరిగి రాకపోవడంతో భార్యతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.