విజయనగర సామ్రాజ్యంలో క్రీ.శ. 1340లో ఉదయగిరి పాలకుడు కంపరాయలు ఒంటిమిట్ట ప్రాంతంలో పర్యటించాడు. ఆయన కొంతపరివారాన్ని వెంటబెట్టుకొని వచ్చాడు. ఈ అడవుల్లో ఇద్దరు బోయలు ఉండే వారు. వారే వంటడు, మిట్టడు. వీరు రాజుకు సేవలందించారు. ఈ సమయంలో సమీపంలో గుట్టమీద చిన్నపాటి గుడి ఉంది. జాంబవంతుడు నిలిపిన శిలలో సీతారామలక్ష్మణులని భావించి దండం పెట్టుకుంటున్నామని, అక్కడ గుడి కట్టి పుణ్యం కట్టుకొమ్మన్నారు. వంటడు..మిట్టడు కోరిక మేరకు కంపరాయలు గుడి, చెరువు నిర్మించేందుకు అంగీకరించాడు. ఆ బాధ్యత బోయలకే అప్పగించాడు.
ఆలయ నిర్మాణం ఇలా..
విజయనగర సామ్రాజ్య చక్రవర్తి బుక్కరాయలు ఒంటిమిట్ట గుడిలో ఏకశిలా విగ్రహం నిలిపిన నాటికి గర్భాలయం, అంతరాళం, చిన్నగోపురం ఉండేవి. మొదటిదశ నిర్మాణమిది. మూడవ దశలో మహామంటపం, మహాప్రాకారం, తూర్పు, ఉత్తర , దక్షిణ గాలిగోపురాలు, మహాప్రాకారం లోపల నైరుతి దిక్కున కల్యాణమంటపం, ఆగ్నేయదిశలో పాకశాల, ప్రాకారంలోపల ఉత్తరం వైపు తూర్పున, పడమర ఎదుర్కోలు మంటపాలు, రామలింగదేవుని గుడి (1966)లో లింగాన్ని నిలిపారు. సంజీవరాయ స్వామి, రథం, రథశాలను ఏర్పాటు చేశారు. అనంతరం అనంతరాజు గుడిని విస్తరించాడు. మహామంటపం, మహాప్రాకారం, గాలిగోపురాల నిర్మాణాలు చేపట్టారు. తెలుగురాష్ట్రాలలో ఒంటిమిట్ట గాలిగోపురాల తరహాలో మరెక్కడా కనిపించవు.


